కాకినాడ, నవంబర్ 13, (way2newstv.com)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీలో బలమైన మద్దతుదారులున్నారని తేలిపోయింది. చంద్రబాబును ద్వేషించే బీజేపీ నేతలు జగన్ ను కాపుకాచేందుకు సిద్దమవుతున్నారు. వెంకయ్యనాయుడు వ్యతిరేక వర్గంగా ముద్ర వేసుకున్న బీజేపీ నేతలు కొందరు జగన్ ను నిత్యం అంటిపెట్టుకునే ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రధాన నేతలందరూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తుంటే కొందరు మాత్రం జగన్ నిర్ణయాలను సమర్ధించడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేసింది.దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగక పోవడానికి వెంకయ్యనాయుడు కారణమని బీజేపీలోని కొందరు నేతలు ఇప్పటికీ భావిస్తారు.
ఆగమ్యగోచరంగా బీజేపీ భవిష్యత్తు
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే దశాబ్దకాలంగా బీజేపీ ఎదగలేకపోయిందన్న భావనలో కొందరు బీజేపీ నేతలున్నారు. అందులో సోము వీర్రాజు ఒకరు. సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన నేత. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీతో ఎలాంటి అనుబంధం నిన్న మొన్నటి వరకూ లేదు. ఎన్నికలకు ముందు ఆయనను పార్టీలోకి తీసుకువచ్చి రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. కన్నా లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇసుక కొరత దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం అంశం వరకూ కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు.అయితే సోము వీర్రాజు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ ను కలసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు జగన్ నిర్ణయాలను సమర్థించారు. ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. జగన్ తో నలభై నిమిషాలకు పైగా భేటీ అయిన సోము వీర్రాజు టీడీపీ అవినీతిని వెలికితీయాలని జగన్ ను కోరడం విశేషం. కేవలం పోలవరం మాత్రమే కాదని, విద్య, వైద్య రంగాల్లో టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సమాచారాన్ని కూడా సోము వీర్రాజు జగన్ కు ఇచ్చినట్లు చెబుతున్నారుజగన్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేయడాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండిచంారు. జగన్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కానీ సోము వీర్రాజు మాత్రం వెంకయ్య ప్రస్తావన తేకపోగా, మన కుటుంబ సభ్యుల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి పేదవాళ్లకు వద్దనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించి సోము వీర్రాజు వెంకయ్యను పరోక్షంగా ఎత్తిపొడిచారు. బీజేపీలో ఒక వర్గం జగన్ పక్షాన నిలుస్తుందని, సుజనాచౌదరి బ్యాచ్ ను పార్టీలో చేర్చుకోవడం ఇష్టంలేని బీజేపీ నేతలు జగన్ కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. మరి సోము వీర్రాజును కట్టడి చేయగల సత్తా ఆ పార్టీలో ఉందా? లేదా? అన్నది చూడాలి.