బాబు దగ్గరకు టీజీ పంచాయితీ
కర్నూలు, నవంబర్ 29, (way2newstv.com)
ఒక ఇల్లు రెండు జెండాలు… ఇప్పుడు రాజకీయాల్లో ఇది కామన్ అయినా… సహజంగా ఒకే కుటుంబంలో అన్నదమ్ములు రెండు పార్టీల్లో కొనసాగడం చూశాం. కానీ తండ్రీ కొడుకులు రెండు పార్టీల్లో ఉంటూ ఏకంగా ఆరు నెలల నుంచి ఒకే నియోజకవర్గంలో రాజకీయం చేస్తుండటం కర్నూలు జిల్లాలోనే చూస్తున్నాం. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కర్నూలు పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. ఎక్కువగా కర్నూలు పట్టణ నియోజకవర్గంపైనే టీజీ వెంకటేష్ కు పట్టుంది.టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ మాత్రం నేటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.
తండ్రి కమలం..కొడుకు టీడీపీ
ఆయన గత ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కర్నూలు పట్టణ నియోజకవర్గానికి టీజీ భరత్ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తండ్రీకొడుకులు పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగా కొందరు టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. స్వయంగా ఆయన కర్నూలు పట్టణంలో పాదయాత్ర చేసి బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఇక టీజీ భరత్ సయితం తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు నిచ్చిన కార్యక్రమాలను స్వయంగా చేస్తున్నారు. ఇసుక కొరతపై ఆందోళన చేశారు. పార్టీకి తిరిగి వైభవం తెస్తానని టీజీ భరత్ చెబుతున్నారు. తమ అనుచరులతో ఆయన వార్డుల వారీగా పర్యటిస్తూ సమస్యలపై ఉద్యమిస్తున్నారు.వచ్చే నెలలో చంద్రబాబు కర్నూలు జిల్లాకు రానున్నారు. ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో కర్నూలు పట్టణ నియోజకవర్గం విషయం తేల్చాలంటున్నారు. తండ్రీ కొడుకులు వేర్వేరు పార్టీల్లో ఉండి ఆందోళన చేయడం ప్రజల్లో అయోమయాన్ని కల్గిస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు వద్ద కర్నూలు పంచాయతీని కొందరు టీడీపీనేతలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టీజీ వెంకటేష్, భరత్ లు ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారు కావడంతో కర్నూలు పట్టణ నియోజకవర్గంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీజీ ఫ్యామిలీని కూడా దూరం చేసుకునే సాహసం చంద్రబాబు చేయరు.