న్యూఢిల్లీ, డిసెంబర్ 5, (way2newstv.com)
కేంద్రంలో చక్రం తిప్పితేనే.. రాష్ట్రానికి నిధులు వస్తాయనేది నిజం. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రం కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. రాష్ట్ర పన్నుల్లో కేంద్రం నుంచి వాటాగా రావాల్సిన నిధుల విషయంలో జాప్యం లేకుండా రావాలన్నా.. వివిధ పథకాలకు రీయింబర్స్‌మెంట్ రావాలన్నా.. కేంద్రప్రభుత్వ ప్రత్యేక పథకాలు విరివిగా దక్కాలన్నా కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం అనేది కీలకమైన విషయం. గత చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని మచ్చిక చేసుకుని, రాష్ట్రానికి అనేక విషయాల్లో లబ్ధి జరిగేలా చక్రం తిప్పుకోగలిగింది.
22 మంది ఉన్నా...నిధుల్లేవ్
అదేవిధంగా కేంద్రంలో మంత్రులుగా ఉన్న అప్పటి టీడీపీ నాయకులు కూడా బాగానే ఉపకరించారు.ఈ క్రమంలోనే రాష్ట్రానికి గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల అభివృద్ది నిధులు, ఏపీ ఫైబర్ నెట్, అందరికీ ఇళ్లు ప్రధాని ఆవాస్ యోజన, అమృత్ వంటి పథకాలు విరివిగా వచ్చాయి. కానీ, ఇప్పుడు జగన్ పరిస్థితి అలా లేదు. లెక్కకు మిక్కిలిగా ఎంపీలు ఉన్నా.. ఉన్నవారిలో ఎక్కువ మంది జూనియర్లు కావడం, కేంద్రంలోని కీలక నేతలతో పెద్దగా పరిచయాలు లేక పోవడం పెద్ద మైనస్‌గా మారిపోయింది. ఇక, ఉన్న విజయసాయి రెడ్డి ఒక్కరే చూస్తున్నా.. ఈయనపై పెద్దగా కేంద్రంలోని పాలకులకు సానుభూతి కోణం లేదనే ప్రచారం జరుగుతోంది.జగన్ – సాయిరెడ్డి ఇద్దరిపైనా కేసులు ఉండడం, వ్యతిరేక ప్రచారం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల కాలం వరకు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రాజ్యాంగ బద్ధపదవిలో ఉన్నా కూడా ఏపీ కష్ట సుఖాలపై ఆయన దృష్టి పెట్టారు. ఉపరాష్ట్రపతి హోదాలోనే ఆయన అనేక రూపాల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, ఏపీలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెలుగు మీడియంను తీసేయడం, ఈ క్రమంలో నేరుగా జగన్ పెద్దలందరి పిల్లలూ ఎక్కడ చదువుతున్నారు ? ఎక్కడ చదివారు ? అని ప్రశ్నించడం. ఈవిషయంలోకి నేరుగా ఉపరాష్ట్రపతిని కూడా లాగడం తెలిసిందే. వెంకయ్యగారి మనవళ్లు ఎక్కడ చదివారు? అని జగన్ ప్రశ్నించారు.దీంతో నొచ్చుకున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీ గురించి పట్టించుకునేందుకు , ఇక్కడి సమస్యలు వినేందుకు కూడా ఇష్టపడడం లేదని తెలిసింది. అంతేకాదు.. ఆయనకు ఎవరూ ఏమీ చెప్పలేరు. ఆయన జోలికి వెళ్లకుండా ఉంటేనే మేలు! అనే రేంజ్‌లో వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక, మోడీ దగ్గర విజయసాయికి యాక్సిస్ ఉన్నా.. ఆయన వింటారు.. ఊ.. అంటారు.. తప్ప పనిచేయడం అనేది లేదు. మోడీ కేవలం విజయసాయిని రెడ్డి గారు అని పలకరింపులతోనే సరిపెట్టేస్తారన్నది అందరికి తెలిసిందేపార్టీ తరపున ఏకంగా 22 మంది ఎంపీలు గెలిచినా టీడీపీ ఎంపీలుగా ఉన్న కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు రేంజ్‌లో అటు పార్టీ తరపున కాని.. ఏపీ సమస్యలపై కాని పార్లమెంటు వేదికగా బలమైన గళం వినిపించే ఎంపీలు లేకుండా పోయారు. కోటగిరి శ్రీథర్, లావు శ్రీకృష్ణదేవరాయులు లాంటి వాళ్లు ఒకరిద్దరు తమ నియోజకవర్గా సమస్యల వరకు బాగానే ప్రస్తావిస్తున్నా రాష్ట్ర సమస్యలపై ఎవ్వరూ నోరు మెదపడం లేదు. దాదాపు 20 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళుతున్నామా ? వస్తున్నామా ? అన్న మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. సో.. ఇలాంటి పరిస్థితిలో జగన్‌కు బలమైన లాబీయింగ్ చేసే నాయకుడు అత్యవసరమని ఢిల్లీ వర్గాలు అంటున్నారు. మరి ఎవరు ముందుకు వస్తారో.. ఏం చేస్తారో ? చూడాలి.