ఏపీలో బీజేపీ బలం 25 - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో బీజేపీ బలం 25

సింగిల్ సీట్ లేకుండా దుమ్మురేపుస్తున్నారు...
న్యూ ఢిల్లీ,  డిసెంబర్ 12 (way2newstv.com)
తెలుగు రాజకీయం మోడీకి బాగా కలసివస్తోంది. ఇక్కడ పాత్రలు, పాత్రధారులు మారుతున్నా కూడా ఢిల్లీ వరకూ చూసుకుంటే మాత్రం మోడీకి పాతిక మంది ఎంపీలు చేతిలో ఉన్నట్లే లెక్క. ఏపీలో ఒక్క ఎంపీ బీజేపీకి లేరన్న కొరత ఎక్కడా కనిపించడంలేదు. ఉమ్మడి పౌరసత్వ సవరణ బిల్లుకు అటు బాబుకు ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటు, జగన్ కి ఉన్న 22 మంది ఎంపీలు కూడా జై కొట్టేశారు. మైనారిటీల అనుమానాలు తొలగించాలని ఒక్క ముక్క చెప్పి వైసీపీ నేత మిధున్ రెడ్డి లోక్ సభకు బిల్లుకు ఓటేస్తే టీడీపీ ఎంపీలు సైతం బిల్లు బాగు బాగు అనేశారు. మరో వైపు తొమ్మిది మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ మాత్రం బిల్లుకు మేము వ్యతిరేకమని క్లారిటీగా చెప్పేసింది. ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎం సరసన వచ్చి చేరింది. దీంతో నిన్నటి వరకూ కేంద్రంలో మోడీ ఏ బిల్లు పెట్టినా మద్దతు ఇచ్చే టీఆర్ఎస్ తొలిసారిగా తాను దూరమే సుమా అంటూ గట్టి సంకేతాలు ఇచ్చింది.
ఏపీలో బీజేపీ బలం 25

అయిదేళ్ళ కాలంలో ఢిల్లీలో బాబుకు ఎన్నో అవమానాలు, ముందు ప్రత్యేక హోదా అన్నారు, తరువాత ప్యాకేజి అన్నారు. ఇక నిధులు సరిగ్గా విడుదల చేయలేదు, ప్రధాని మోడీ సైతం అప్పాయింట్మెంట్లు ఎపుడూ తనకు ఇవ్వలేదని బాబు ఎన్నో సార్లు వగచి విలపించారు. అదే కధ జగన్ విషయంలో కూడా ఇపుడు సాగుతోంది. ఆరు నెలల కాలమైనా కూడా కేంద్రం ఏపీకి విదిలించింది పైసా సాయం కూడా లేదు. జగన్ ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి కనీసం పెద్దలను సైతం కలవకుండా ఉత్త చేతులతో వచ్చేశారు. ఏపీలో బీజేపీ నాయకులు జగన్ ని నానా మాటలు అంటున్నారు. ఢిల్లీలో జగన్ కి వ్యతిరేకంగా లాబీ తయారు చేస్తున్నారు. మరో వైపు బాబు పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. బాబుని సైతం ఏపీ బీజేపీ పక్కన పెట్టేసింది. ఆయనతో పొత్తు లేదు అంటూ ఖండితంగా చెప్పేస్తోంది. బాబు అమరావతి మీద రౌండ్ టేబిల్ సమావేశం పెడితే మేము రాము అని బీజేపీ అవమానించింది. ఇవన్నీ దిగమింగుకుని మరీ బాబు బీజేపీ పెడుతున్న ప్రతీ బిల్లుకూ మద్దతు ఇస్తున్నారు. తమ ఎంపీల చేత అనుకూలంగా ఓటు వేయిస్తున్నారు. ఇలా బాబు, జగన్ పోటా పోటీగా మోడీ జై అంటున్నారు.ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీ తెచ్చుకుని జగన్ ఉంటే విశేష రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు మోడీని సమర్దించడంలో మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. అదే సమయంలో ఏపీ ప్రయోజనాల విషయంలో నిలదీయలేకపోతున్నారు. ఊసుపోని కబుర్లతో అసెంబ్లీలో సవాళ్ళు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లెషణలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా నీవు తేలేదు అంటే నీవు తేలేదు అని వాదనలు చేసుకుంటూ గడిపేస్తున్నారు తప్ప ఢిల్లీని నిలదీయలేకపోతున్నారు. అదే సమయంలో విభజన హక్కులు, హమీలు, రాజధాని, పోలవరం నిధులు ఇలా ఎన్నో అంశాల్లో మోడీ మొండి చేయి చూపిస్తున్నా కూడా మద్దతు ఇవ్వడం ద్వారా అలుసు అయిపోతున్నారనే అంటున్నారు.అదే కేసీఆర్ కేంద్రాన్ని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. విభజన నిధులు పాతిక వేల కోట్ల వరకూ రావాలని లెక్క చెప్పి మరీ డబాయిస్తున్నారు. కేటీయార్ అయితే ఉత్తరాది దక్షిణాదీ తేడా చూపిస్తున్నారంటూ మోడీ మీదే హాట్ కామెంట్స్ చేశారు. విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఏపీ నేతలు మాత్రం ఇక్కడ సోదిలోకి లేని బీజేపీని పల్లకీలో పెట్టి ఊరేగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం మోడీ అమిత్ షా కరెక్ట్ రాజకీయ నాయకులు అంటూ కీర్తిస్తున్నారు. మరి ఏపీకి బీజేపీ ఏం చేయకపోయినా ప్రధాన పార్టీల నేతలు ఇలా మోసేయడం ద్వారా జనాలకు తీరని అన్యాయమే చేస్తున్నారని అంటున్నారు. ఓ విధంగా ఏపీ రాజకీయ నేతల పోకడల వల్లనే కాగితం పులి లాంటి బీజేపీ కాస్తా ఇపుడు బెబ్బులి అవుతోందని అంటున్నారు.