90 లీటర్లతో మదర్ ఓన్ మిల్క్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

90 లీటర్లతో మదర్ ఓన్ మిల్క్

గుజరాత్, డిసెంబర్ 28, (way2newstv.com)
పిల్లలకు తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలి. చనుబాలు వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతారు. కానీ, ఈ రోజుల్లో అందాన్ని కోల్పోతామనే భయంతో చాలామంది తల్లులు పిల్లలకు చనుబాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.సొంత పిల్లలకే పాలు ఇచ్చేందుకు ఆలోచించే ఈ రోజుల్లో.. పరాయి పిల్లలకు తమ చనుబాలను దానమిచ్చే తల్లులు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యకరమే. పలు కారణాల వల్ల చనుబాలుకు దూరమయ్యే పిల్లల కోసం ఓ మహిళ స్వచ్ఛందంగా ప్రారంభించిన ‘తల్లిపాల బ్యాంక్’ ఇప్పుడు ఎంతోమందికి చిన్నారులకు ప్రాణం పోస్తోంది. 
90 లీటర్లతో మదర్ ఓన్ మిల్క్

ఈ బ్యాంక్ మరెక్కడో కాదు, మన దేశంలోనే అహ్మదాబాద్‌లో ఉంది.రుషినా మార్ఫాటియా అనే మహిళ తన బిడ్డ కోసమే కాకుండా, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలను బతికించేందుకు అదనంగా చనుబాలను ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల ఐసీయూలో చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఐదుగురు పిల్లలు ఆమె చనుబాలు వల్లే బతికారంటే ఆశ్చర్యపోక తప్పదు.  అర్పన్ న్యూబోర్న్ కేర్ సెంటర్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ మెహతా మాట్లాడుతూ.. ‘‘రుషినా మేలు మరవలేనిది. 600 నుంచి 1.5 కిలోలు లోపు జన్మించిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వాళ్లు చాలా వీక్‌గా కూడా ఉంటారు. అలాంటి పిల్లలకు చనుబాలే ఔషదం. ఆ సమయంలో రుషినా తన చనుబాలు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడారు’’ అని తెలిపారు.కొంతమంది తల్లులకు వెంటనే పాలు రావు. ఆ సమయంలో వేరే తల్లి నుంచి పాలు సేకరించి పిల్లలకు పట్టించాల్సి వస్తుంది. ఈసమస్యను అధిగమించేందుకు అర్పన్ న్యూబోర్న్ కేర్ సెంటర్‌లో ఈ ఏడాది ‘ఆర్ఫన్స్ మామ్ ’ (మదర్ ఓన్ మిల్క్) బ్యాంక్ ప్రారంభించారు. ఇందులో తల్లుల నుంచి సేకరించిన చనుబాలును నిల్వ ఉంచుతారు.రుషినా మాట్లాడుతూ.. ‘‘నా చనుబాలు పసివాళ్ల ప్రాణం కాపాడతాయని తెలిసి ఆశ్చర్యపోయాను. మొదట్లో నా బిడ్డకు మాత్రమే పాలిచ్చేదాన్ని. ఈ విషయం తెలిసిన తర్వాత వాడికి కొన్ని పాలు తాగించిన తర్వాత మిగతావి మామ్ బ్యాంక్‌కు ఇస్తున్నా. భవిష్యత్తులో కూడా దీన్ని కొసాగిస్తా’’ అని తెలిపారు.రుషినా తరహాలో చాలామంది మంది తల్లలు ఈ విషయం తెలుసుకుని ‘మామ్ బ్యాంక్’కు చనుబాలు దానం ఇస్తున్నారు. ఇప్పటివరకు 90 లీటర్ల పాలను దానం ఇచ్చారు. సుమారు 600 మహిళలు 150 మిల్లీ లీటర్లు చొప్పున చనుబాలను దానమిస్తున్నారు. చూశారుగా తల్లిపాలు పిల్లలకు ఎప్పుడు శ్రేయస్కరమే. కాబట్టి.. తప్పకుండా వారికి చనుబాలను తాగించండి. చనుబాలు రాక ఇబ్బందిపడుతున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. లేకపోతే పిల్లలు రోగ నిరోధకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.