కాదు..కాదు అంటూనే దగ్గరవుతున్న కరణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాదు..కాదు అంటూనే దగ్గరవుతున్న కరణం

ఒంగోలు, డిసెంబర్ 20, (way2newstv.com)
రణం బలరాం… చంద్రబాబుతో సమానంగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కరణం బలరాంకు కాలం కలసి రాలేదు. ఇప్పటి వరకూ ఆయన మంత్రి కాలేకపోయారు. తెలుగుదేశం అధికారంలో వచ్చినప్పుడు ఆయన గెలవలేదు. కరణం బలరాం గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సామజిక సమీకరణల నేపథ్యంలో కరణం బలరాంకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ అసంతృప్తి కరణం బలరాంలో బాగా నాటుకుపోయి ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. అందుకే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తు న్నారంటున్నారు.ఒకప్పుడు కరణం బలరాం పేరు చెబితే ప్రత్యర్థులకు సింహస్వప్నమే. అంత దూకుడుగా ఉండేవారు. రాష్ట్ర స్థాయిలో కాకున్నా జిల్లా స్థాయిలో కరణం బలరాం చెప్పిందే వేదంగా నాడు నడిచింది. కరణం బలరాం తన దూకుడుతో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి నేతల మనసులను కూడా గెలుచుకున్నారు. 
కాదు..కాదు అంటూనే దగ్గరవుతున్న కరణం

80వ దశకంలో ఇందిరాగాంధీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆమె పర్యటనను అడ్డుకోవాలని చూస్తే కరణం బలరాం ముందు నిలబడి ఇందిర పర్యటన సజావుగా జరిగేలా చూశారు. 1978లో కరణం బలరాం, చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి వీరంతా ఒకే సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో మంత్రి పదవి ఇస్తామన్నా తన స్నేహితుడు చంద్రబాబు కోసం కరణం బలరాం త్యాగం చేశారన్న ప్రచారమూ ఉంది.చంద్రబాబుతో సమానంగా నలభై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నా కరణం బలరాంకు ఇప్పటి వరకూ మంత్రి పదవి దక్కలేదు. దీనికి కారణం చంద్రబాబు అన్నది కరణం గట్టిగా విశ్వసిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చినా తన ప్రత్యర్థి గొట్టి పాటి రవికుమార్ ను చేరదీసి తన కుటుంబాన్ని దూరం పెట్టారని కరణం బలరాం సన్నిహితుల వద్ద వాపోతుంటారు. కరణం బలరాం వైఎస్ హయాంలోనూ దూకుడుగా ఉండేవారు. అప్పట్లో స్పీకర్ సురేష్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసి ఆరు నెలల పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరణనకు గురయ్యారు. ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కరణం బలరాం గెలిచారు.ఈసారి చీరాల నియోజకవర్గం నుంచి గెలుపొందినా టీడీపీ అధికారంలోకి రాలేదు. పైగా తన ప్రత్యర్థిని పార్టీలోకి తెచ్చిపెట్టుకోవడం ఆయనకు చికాకు తెప్పిస్తుంది. అందుకే ఆయన అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు. తన పని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ను ధీటుగా సమాధానమిస్తున్నా అసెంబ్లీలో మాత్రం సైలెంట్ గానే ఉండటం వెనక చంద్రబాబు మీద అసంతృప్తి కారణమంటున్నారు. కరణం బలరాంలో ఉన్న అసంతృప్తిని గమనించిన వైసీపీ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లారు. త్వరలోనే కరణం బలరాం కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆయన అనుచరులు స్పష్టంగా చెబుతున్నారు