నెల్లూరు, డిసెంబర్ 11, (way2newstv.com)
ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల్లో ఎక్కడా లేని సమస్యలు నెల్లూరుతోనే జగన్ కి వస్తున్నాయా అని పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీని నెత్తిన పెట్టుకున్న జిల్లాల్లో నెల్లూరు ముందు వరసలో ఉంటుంది. ఇక్కడ 2014 లో కూడా టీడీపీకి పెద్దగా కలసివచ్చిందేమీలేదు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా ప్రతీసారీ ఏపీలో సంచలనంగా మారుతోంది. వైసీపీకి బలమైన జిల్లా నుంచే వ్యతిరేక స్వరాలు వినిపించడం అంటే విచిత్రమే. ఇక్కడ ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లావారే. ఇక అందులో విజయసాయిరెడ్డి చూస్తే జగన్ కి కుడిభుజం లాంటి వారు. మరో వైపు వైసీపీ పెట్టినప్పటినుంచి దిగ్గజ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ పక్కనే ఉంటూ అండా దండా అందించారు. మరో వైపు బీసీలు, ఇతర వర్గాలు సైతం జగన్ వైపే నిలిచి వైసీపీకి గట్టి పునాదులు వేసిన జిల్లా నెల్లూరు. అయినా సరే అసమ్మతి తలనొప్పి ఈ జిల్లా నుంచే రావడం గమనార్హం.
నెల్లూరు వైసీపీలో కుంపట్లు
నెల్లూరు జిల్లా అనగానే సీనియర్ నేతలతో పాటు పార్టీకి వీర విధేయుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తుకువస్తారు. ఇక ఆయన ఈ మధ్య ఎంపీడీసీపై దాడి ఘటనలో జగన్ సర్కార్ ని ఇబ్బందుల పాలు చేశారు. ఇక ఆయనకు వైసీపీలో ఉన్న మరో నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి పడదు, ఇది పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాట కాస్తా వేరే రూపాల్లో బయటపడంతో పార్టీ పరువు బజార్న పడుతోంది. ఇది ఎంతవరకూ వచ్చిందంటే కోటంరెడ్డి అరెస్ట్ కి సొంత పార్టీ నేతలే పావులు కదపాలని కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించారు. వీధి పోరాటాలకు దిగుతున్న ఈ ఇద్దరు నేతలను పిలిచి క్లాస్ తీసుకోవడంతో నెల్లూరు వైసీపీలో కొంత సర్దుబాటు ఉందని అంతా అనుకున్నారు. అది చాలదన్నట్లుగా ఇపుడు మాజీ మంత్రి సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు.నిజానికి జగన్ నెల్లూరు జిల్లాలో యోధానుయోధులు ఉంటే వారిని కాదని జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రిని చేశారు. అదే విధంగా మరో జూనియర్ అయిన మేకపాటి వారసుడు గౌతం రెడ్డికి అమాత్య కిరీటం తొడిగారు. దీని వల్ల ఆనం మొదట్లోనే తన బాధను వెళ్ళగక్కారు. అయితే జగన్ ఆయనకు వేరే ఏదైన న్యాయం చేస్తారని అంతా అనుకున్నారు. అయితే మంత్రి పదవి పోయింది, జిల్లాలో పెద్ద దిక్కుగా కూడా తనకు గౌరవం దక్కడం లేదన్న ఆక్రోశం నుంచే ఆనం నోట సంచలన కామెంట్స్ వచ్చాయని అంటున్నారు. టీడీపీ నేతలు తరచూ అనే లిక్కర్ మాఫియా తో పాటు ఇతర మాఫియాలను సైతం ఆనం వల్లె వేయడంతో వైసీపీ ఇరుకున పడినట్లైంది. తాను సీనియర్ని అని చెప్పుకోవడానికి ఆనం 38 ఏళ్ళ రాజకీయ అనుభవం తనదని కూడా పదే పదే వల్లించారు. ఓ విధంగా ఆయన జగన్ సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అయ్యారనుకోవాలి.నెల్లూరు రెడ్లకు మంత్రి పదవి ఖాయమని ఎపుడూ ఫిక్స్ అయిన వ్యవహారం. దాన్ని అడ్డం తిప్పి బీసీలకు కూడా జగన్ తన క్యాబినేట్లో చోటు కల్పించారు. అదలా ఉంచితే టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుని చేర్చుకోవడం ద్వారా బడుగులకు పెద్ద పీట వేయాలనుకుంటున్న సంకేతాన్ని జగన్ పంపిస్తున్నారు. దీంతో నెల్లూరులోని పెద్ద తలకాయలు రగిలిపోతున్నాయని అంటున్నారు. మరో నేత, సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు కూడా కొంత బాధ ఉందని అంటున్నారు. వీటన్నిటికీ గట్టి హెచ్చరికగా విజయసాయిరెడ్డి ద్వారా జగన్ సందేశం వినిపించారు. గీత దాటొద్దు అని మాత్రమే విజయసాయి చెప్పినా కూడా దాటితే ఏమవుతుందన్నది అందరికీ తెలిసిందే. మరి గీత దాటాలనుకున్న వారికి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ అంతవరకూ కధ నడుస్తుందా లేదా అన్నది చూడాలి.