ధరల్లేక వేరుసెగ రైతుల ఇక్కట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధరల్లేక వేరుసెగ రైతుల ఇక్కట్లు

కర్నూలు, డిసెంబర్ 13, (way2newstv.com)
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోంది. అనావృష్టి, అతివృష్టిలను ఎదుర్కొని పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర కాదు కదా కనీసం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా లభ్యంకాని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది.రాష్ట్రంలో వేరుశనగ సాధారణసాగు 7.53 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది జూన్‌, జులై, ఆగష్టు నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కేవలం 5.62 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయింది. కర్నూలు జిల్లాలో 80,101 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 3,66,059 హెక్టార్లు, చిత్తూరు జిల్లాలో 95,373 హెక్టార్లలో సాగయింది. 
ధరల్లేక వేరుసెగ రైతుల ఇక్కట్లు

వర్షాభావంతో దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి.కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు డిసెంబరు రెండోవారం నాటికి 55 వేల క్వాంటాళ్లు మాత్రమే వచ్చాయి. వేరుశనగకు కేంద్ర ప్రభుత్వం రూ.5090ల కనీస మద్దతు ధరను ప్రకటించింది. రెండు నెలల క్రితం సగటు క్వింటా రేటు రూ.7.469లు పలికింది. ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా సగటు రేటు రూ.3940 వస్తుంది. సాధారణంగా మార్కెట్‌లో ధరలు పతనమైనపుడు ఆయిల్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధరను ఇవ్వాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 15 రోజుల క్రితం కనీస మద్దతు ధరతో వేరుశనగ కొనుగోలు చేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి దాక కనీసం ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయలేదు. ఆయిల్‌ఫెడ్‌ రంగంలోకి దిగి కొనుగోలు చేస్తే ట్రేడర్స్‌ కూడా అదే పద్ధతిలో గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉంది.మూడు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశా. ఎకరాకు 45 బస్తాలు రావాలి. కానీ 30 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. ధర కూడా లేదు.ధర లేక నిల్వ చేశానంటున్నారు రైతు. మరో రైతుఎనిమిది ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. 70 సంచుల దాకా దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్‌లో క్వింటా రూ.4 వేలకు లోపే ధర పలుకుతుండడంతో అమ్మకుండా ఇంట్లోనే నిల్వ పెట్టుకున్నా. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా బరువు తగ్గి నష్టమే వస్తుంది. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాని కోరుతున్నారు