నేతల రాజీనామాతో గందరగోళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతల రాజీనామాతో గందరగోళం

బెంగళైర్, డిసెంబర్ 28  (way2newstv.com)
కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో ఇప్పటికీ తెలియదు. ఇద్దరు ప్రధాన నేతలు రాజీనామాలు చేసి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త వారిని నియమించలేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పదిహేను స్థానాలకు గాను రెండింటిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య, దినేష్ గుండూరావులు రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేసి దాదాపు పదిహేను రోజులు గడుస్తుంది.దినేష్ గుండూరావుపై పెద్దగా కాంగ్రెస్ అధిష్టానానికి సానుకూలత లేదు. దినేష్ గుండూరావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి నేతలనను సమన్వయం చేసుకోలేకపోయారన్నది అధిష్టానం అభిప్రాయం. 
నేతల రాజీనామాతో గందరగోళం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్న సమయంలో దానిని నియంత్రించ లేకపోవడంతో పాటు సరైన సమయంలో హైకమాండ్ కు సమాచారం అందించలేదన్నది కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన దినేష్ గుండూరావు స్థానంలో కొత్తవారిని నియమించనున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.ఇక సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పటికీ ఆయన రాజీనామాను ఆమోదించే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కొంత మల్లగుల్లాలు పడుతుంది. బలమైన నేత కావడంతో ఆయనను సీఎల్పీ పదవిలోనే కొనసాగించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే సిద్ధరామయ్య ఈ పదవిలో ఉండేందుకు ససేమిరా అంటున్నారు. సీనియర్ నేతల వ్యవహారశైలిపై ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో సీఎల్పీ పదవికి కూడా కొందరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఇందుకు సిద్ధరామయ్య అంగీకరిస్తేనే ఆ పదవిని వేరే వారికి అప్పగిస్తారు.సీఎల్పీ పదవి కోసం దళితనేత పరమేశ్వర పేరు తొలినాళ్లో విన్పించినా ఆయనకు ఆ అవకాశం కల్పిస్తే సిద్ధరామయ్య వ్యతిరేకించే అవకాశముంది. అందుకని సీఎల్పీ పదవి కోసం మరో నేత పేరును పరిశీలిస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది. ఇందులో వేరే పేరు విన్పించడానికి ఆస్కారం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరి కర్ణాటక కాంగ్రెస్ ను సిద్ధరామయ్య లేకుండా నడిపించడమంటే సందేహమనే చెప్పాలి. మొత్తం మీద కీలక సారథులు లేకుండానే కాంగ్రెస్ నెట్టుకొస్తుంది.