ఒంగోలు, డిసెంబర్ 12, (way2newstv.com)
రాజకీయాల్లో నాయకులు పార్టీ మారుతుండడం కామన్ అయిపోయిన రోజుల్లో ఎవరు ఎప్పుడు ఏ గోడను ఎటు నుంచి దూకుతారో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో అనేక ఊహాగానాలు, వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిలో ముగ్గురూ వైసీపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని, వైసీపీ కూడా వీరిపై ప్రెజర్ తెస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, రోజులు గడిచే కొద్దీ.. ఇద్దరని చెబుతూ వచ్చాయి. వాస్తవానికి అసెంబ్లీ శీతాకాల సమావే శాలు ప్రారంభం అయ్యే నాటికి కనీసంలో కనీసం ఇద్దరైనా టీడీపీకి ఝలక్ ఇస్తారని అనుకున్నారు.
ప్రకాశం టీడీపీ నేతల దారెటు...
అయితే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం నాటికి ఏ ఒక్కరూ కూడా పార్టీ మారిన సందర్భం లేదు. పైగా వీరిలో ముగ్గురు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఇద్దరూ కూడా ఆది నుంచి పార్టీలు మారే సంస్కృ తి తమకు లేదని, తమకు టీడీపీ రాజకీయ జీవితం ఇచ్చిందని చెబుతూ వస్తున్నారు. ఇక, అద్దంకి నుంచి మూడోసారి.. ఓవరాల్‌గా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటి రవి కూడా తాజాగా వివరణ ఇచ్చుకున్నారుపార్టీ మారే ఆలోచనే లేదని చెప్పారు. ‘నా రాజకీయ వైఖరి లో మార్పులేదు. బయట ఏదో ప్రచారం జరుగుతోంది. నేను పార్టీ మారట్లేదు. పార్టీ మారే ఆలోచన నాకు లేదు. నా క్వారీల్లో అధికారులు తనిఖీలు చేశారు. దానివలన ఇబ్బందులు ఉన్నాయి. దాడులు జరిగినా నా వైఖరిలో మార్పు లేదు. క్వారీ వ్యాపారం మా కుటుంబ వ్యాపారం. 1990 నుంచి మా నాన్న హయాం నుంచి క్వారీ వ్యాపారం చేస్తున్నాం’ అని గొట్టిపాటి చెప్పుకొచ్చారు.ఇక, మిగిలింది కరణం బలరాం. ఈయనైతే.. తనకు ఎలాంటి ఇసుక, రాళ్ల వ్యాపారాలు లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు పార్టీ మారాల్సిన అవసరం ఏంటని ఎదరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈయనకు పుత్ర వ్యామోహం ఉంది. కుమారుడు గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చేందుకు కరణం వెంపర్లాడుతున్నారు. దీంతో ఆయన పార్టీమార్పుపై మాత్రం ఇతమిత్థంగా తేల్చి చెప్పకపోవడం గమనార్హం. సో.. గొట్టిపాటి క్లారిటీ ఇచ్చినా.. కరణం మాత్రం మౌనం వహించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.