నెల్లూరు, డిసెంబర్ 11, (way2newstv.com)
దక్షిణాదిలో బలపడాలని కలలు కంటున్న బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాలపైనా కన్నేసిన విషయం తెలి సిందే. 2014లో చంద్రబాబుతో కలిసి అధికారం కూడా పంచుకుంది. అయితే, తర్వాత విభేదాల కారణంగా రెండు పార్టీలూ దూరమయ్యాయి. అయితే, వచ్చే 2024 ఎన్నికలకు ముందుగానే బీజేపీని ఏపీలో బలోపేతం చేయాలనేది కమల నాథుల ఆశ. ఈ క్రమంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జనసేనాని పవన్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు కూడా అయితే. ఇది ఎంతవరకు ఫలిస్తుంది? ఏ రాష్ట్రంలో అయినా ప్రజలను తనవైపు తిప్పుకోకుండా బీజేపీ కానీ, మరేదైనా పార్టీ కానీ.. అధికారంలోకి వచ్చిన సందర్బం ఉందా ?ఉదాహరణకు కాంగ్రెస్‌నే తీసుకుంటే.. ఏపీ ప్రజల మనోభావాలను విస్మరించి రాష్ట్ర విభజనకు తెగబడిన కారణంగానే కదా..
జగన్ స్ట్రాటజీతో బీజేపీకి కలిసొస్తుందా
ఇప్పుడు కనీసం జెండా పట్టుకునే వాడు కాదు కదా.. జెండానే కనిపించని పరిస్థితి వచ్చింది. మరి ఏపీలో జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించాల్సిన అవసరం లేదా ? విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఏదో చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఏమైనా భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ? నిధులు ఇవ్వనక్కరలేదా ? పైగా.. ఏపీలో బీజేపీ పుంజుకు నేందుకు ఇప్పుడు చక్కని అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. దీనికి ప్రధాన కారణం.. కేంద్రం ఏపీకి ఏం చేసినా.. చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.కేంద్రం ఏపీకి ఒక్క రూపాయి ఇచ్చినా.. ఔను..ఈ సొమ్ము కేంద్రమే ఇచ్చిందని ఆయన చెప్పుకొంటున్నా రు. ఎక్కడా దాపరికం లేకుండా పాలనను ముందుకు తీసుకు వెళ్తున్నారు. గతంలో ఈ విషయంలోనే బాబుకు, బీజేపీకి చెడింది. కేంద్రం నిధులు ఇచ్చినా బాబు తమ అక్కౌంట్లో వేసుకున్నప్పటి నుంచి రెండు పార్టీల మధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది. ఉదాహరణకు రైతు భరోసా విషయంలో ఇదే జరిగింది. కేంద్రం ఈ పథకంలో ప్రధాని కిసాన్ యోజన కింద రైతులకు రూ.6000 ఇస్తోంది. దీనిని కలిసి జగన్ 12500 ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయన స్వచ్ఛందంగా వైఎస్సార్ రైతు భరోసా-ప్రధాని కిసాన్ యోజనగా పేరు పెట్టి మరీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇళ్ల విషయంలోనూ కేంద్రం పెట్టిన పేరునే ఉంచేవారు. గ్రామీణ సడక్ యోజన (గ్రామాల్లో రోడ్ల నిర్మాణం) సహా ఏపీ ఫైబర్ నెట్‌కు కేంద్రం నుంచి నిధులు వస్తే.. అప్పటి మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ ఒక్క మాట కూడా బీజేపీ తరపున మాట్లాడలేదు. పైగా అన్నీ మా నిధులే.. ఎందుకు ఇవ్వరు ?… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని పేరు చెప్పుకొంటున్నారా ? అంటూ ఎదురు దాడి చేసింది. కానీ, ఇప్పుడు ఏపీ పాలనతోపాటు.. పాలకుల ఆలోచన కూడా మారింది. కేంద్రంలోని బీజేపీకి ఇది చక్కని అవకాశం. ఈ పరిస్థితిని బీజేపీ వినియోగించుకుంటే, ఏపీ ప్రజలకు మేలు చేయడం ద్వారా, వారి చిరకాల కోరిక అయిన ప్రత్యేక హోదా వంటివి అమలు చేయడం ద్వారా ప్రజలకు చేరువ కావడం మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి కమల నాథులు ఈ సూచనలు పాటిస్తారో.. లేక కర్రవీడి సాము చేస్తారో ? చూడాలి.