విజయనగరం, ఏలూరు, డిసెంబర్ 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజులు చాలా ముఖ్యమైన పాత్రే పోషిస్తారు. గత నాలుగు దశాబ్దాలుగా గోదావరి జిల్లాలకు చెందిన రాజుల రాజకీయం ఓ ప్రస్థానంగా కంటిన్యూ అవుతోంది. అలా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు రాజుల రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చేసింది. ఈ విధంగా రాజకీయ జీవితం ముగింపులో ఉన్నవారిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ముందు వరుసలో ఉంటారు. అశోక్ గజపతి దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయనగరం ప్రజలకు సేవలు చేస్తూ వస్తున్నారు.1978లో జనతా పార్టీలో రాజకీయ అరంగ్రేటం చేసిన అశోక్…విజయనగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 1983 నుంచి అప్రతిహతంగా 1999 వరకు టీడీపీ తరుపున విజయనగరం అసెంబ్లీ నుంచి విజయ బావుటా ఎగురవేశారు.
రాజకీయాలకు రాజులు గుడ్ బై
అయితే అప్పటివరకు తిరుగులేని విజయాలు సాధించిన అశోక్ కు 2004లో బ్రేక్ పడింది. అప్పుడు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక 2009 లో మళ్ళీ గెలిచిన అశోక్…2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు.ఇక అప్పుడు కేంద్రంలో బీజేపీలో పొత్తు ఉండటం వల్ల పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత బీజేపీతో పొత్తు తెగదెంపులు కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఇక 2019లో మరోసారి ఈయన విజయనగరం ఎంపీగా పోటీ చేశారు గానీ విజయం దక్కలేదు. ఇటు రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి, తన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీని బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈయన పోటీ చేయడం కష్టమే. ఇక అశోక్ కుమార్తె అతిథి గజపతి మాత్రమే ఇప్పుడు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాక్టివ్‌గా ఉంటున్నారు.అటు విజయనగరంలో ఉన్న మరో ఎస్టీ వర్గానికి చెందిన మహారాజు కిషోర్ చంద్రదేవ్. కురుపాం రాజుగా ఉన్న ఈయన కాంగ్రెస్ లో 5 సార్లు ఎంపీగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు. అలాగే యూపిఏ-2లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా ఉండటంతో మొన్న ఎన్నికల్లో టీడీపీలో చేరి అరకు ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. తనకన్నా చిన్నది.. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని గొడ్డేటి మాధవి ఆయన్ను చిత్తుగా ఓడించింది. ఓడిపోయిన దగ్గర నుంచి ఈయన అడ్రెస్ లేరు. వయసు కూడా మీద పడటంతో వచ్చే ఎన్నికల్లోపు రాజకీయాలకు దూరం కావడం ఖాయం.ఇక మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్న కనుమూరి బాపిరాజు పరిస్థితి కూడా ఇదే బాటలో నడుస్తోంది. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పని చేసిన కనుమూరి… టీటీడీ చైర్మన్ గా కూడా పని చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న అందులోనే కొనసాగుతున్నారు. కాకపోతే ప్రస్తుతానికి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కనిపించే అవకాశం కూడా లేదు. అలాగే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పరిస్థితి కూడా వీరికి తీసిపోలేదు.2014లో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన గోకరాజు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం లేదు. ఆయన రాజకీయాలకు దూరమయ్యి ఆయన తనయుడు రంగరాజు ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. అటు బొబ్బిలిలో ఉన్న బొబ్బిలి రాజవంశీకుడు అయిన మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు పరిస్తితి కూడా అటు ఇటుగానే ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన భవిష్యత్తు ఏంటో అర్ధం కాకుండా ఉంది. మొత్తం మీద ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ రాజుల రాజకీయం ఇంతటితో ముగిసినట్లే కనిపిస్తోంది.