విజయవాడ, డిసెంబర్ 27, (way2newstv.com)
రాజధాని అంశంపై ఎక్కువగా మాట్లాడాల్సింది మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి ఇన్నాళ్ళూ కూడా ఆయనే మాట్లాడారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన్ని హైజాక్ చేస్తూ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడం పట్ల మంత్రి గారు తెగ ఫీల్ అవుతున్నారని చెప్పకనే చెప్పేసుకుంటున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక తరువాత విశాఖ టూర్ చేసిన విజయసాయిరెడ్డి భీమిలీ రాజధాని ప్రాంతమని కచ్చితంగా చెప్పేశారు. ఆయనేమీ మీడియాతో చెప్పలేదు. భీమిలీలో జరిగిన ఓ బహిరంగ సభలోనే భారీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అటువంటి దాన్ని ఇపుడు బొత్స సత్యనారాయణ ఖండించే ప్రయత్నం చేయడమే అసలైన రాజకీయ విడ్డూరం.
బొత్స హై జాక్ అయిపోయారా...
మీడియాకు ఎందుకు తొందర. విశాఖలో రాజధాని ఎక్కడో నేనే చెబుతానంటూ బొత్స సత్యనారాయణ తన పెద్దరికాన్ని గట్టిగా చాటుకోవడానికి చేసిన ప్రయత్నం ఓ విధంగా వైసీపీలో ఆయన గారి పరిస్థితిని చెప్పిందని సెటైర్లు పడుతున్నాయి. విశాఖలో రాజధాని విషయమై తమ ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, ఆ కమిటీ అనువైన స్థలం చూసి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ అంటున్నారు అప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏదీ లేదని అనేస్తున్నారు మరి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనకు విలువ లేదని బొత్స సత్యనారాయణ చెప్పదలచుకున్నారా అన్న మాట ఈ సందర్భంగా వినిపిస్తోంది.ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డి భీమిలీ టూర్లో ఈ ప్రాంతమే రాజధాని నగరం అవుతుందని ప్రకటించారు. ఇది జగన్ తనతో పంచుకున్న మాటగా కూడా అయన అనడం విశేషం. అన్ని విధాలుగా అనువైన ప్రాంతం భీమిలీ అని కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఓ విధంగా జగన్ ఆత్మగా వైసీపీలో విజయసాయిరెడ్డిని అంతా భావిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాన్ని ఆయన చక్రం తిప్పినట్లు తిప్పుతున్నారని పార్టీలోపలా బయటా టాక్ ఉంది. మరి విజయసాయిని కాదని బొత్స సత్యనారాయణ ఇలా చెప్పడం అంటే ఆయన తనను సైడ్ చేస్తున్నారన్న బాధనే వ్యక్తం చేస్తున్నారని భావిస్తున్నారు.నిజానికి బొత్స సత్యనారాయణను రాజధాని విషయంలో లీకులు ఇవ్వడానికి గతంలో బాగానే ఉపయోగించుకున్నారు. అమరావతి రాజధాని ఉండదు అని చెప్పడానికి బొత్స వివిధ సందర్భాల్లో వివాదాస్పద ప్రకటనలు చేశారు. అది కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఆయన ఆ విధంగా మాట్లాడారు. తీరా రాజధాని అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు, చివరిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కీలకమైన ప్రకటన చేసి ఏపీలో హాట్ టాపిక్ చేశారు. ఇపుడు విజయసాయిరెడ్డి ఏకంగా రంగంలోకి దిగిపోయారు. రాజధానిపై క్లారిటీగా ఒకసారి జగన్ స్టేట్మెంట్ ఇచ్చాక ఇపుడు బొత్స సత్యనారాయణ పాత్ర ముగిసిందనే వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. భీమిలీ రాజధాని కాదని బొత్స అనడం వెనక తనను తక్కువ చేస్తున్నారని ఆవేదన తప్ప అసలు విషయాలు విజయసాయిరెడ్డి కంటే ప్రభుత్వంలో తెలిసిన వారు ఎవరూ లేరని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మొత్తానికి బొత్స సత్యనారాయణ పేరుకే మంత్రిగా మిగిలిపోతున్నారని అంటున్నారు.