విశాఖపట్టణం, డిసెంబర్ 30, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ? తెలుగుదేశం పార్టీకే కాదు విపక్షాలన్నీ అధికారపార్టీని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలు అధికారికంగా వెలువడకుండానే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ డౌట్ వచ్చింది. అంతకుముందు ఏపీకి కూడా కెసిఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ దుమ్మెత్తిపోసిన వారంతా ఇప్పుడు తమ ఆరోపణలను విజయసాయి పై ఎక్కుపెట్టారు. అయితే ఈ ఆరోపణలను వైసిపి పెద్దగా ప్రస్తుతం పట్టించుకోకపోయినప్పటికి ప్రజలకు సమాధానం చెప్పాలిసిన అవసరం ఏర్పడింది.విజయసాయి రెడ్డి విపక్షంలో వున్నప్పటినుంచి వైసిపి కి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన విజయసాయిరెడ్డి
నాడు కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం అయిన విజయ సాయి మొన్నటి ఎన్నికల్లో టికెట్ల ఎంపిక నుంచి క్యాబినెట్ కూర్పు వరకు కీలకపాత్రే వహించారన్నది అందరికి తెలిసిందే. విజయసాయి గీసిన గీత ముఖ్యమంత్రి జగన్ దాటేదే ఉండదని వైసిపి లో సైతం అంతా అనే మాటే. ఇక విజయసాయి రెడ్డి ఎస్ అంటేనే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ మంత్రులనుంచి కింది స్థాయి వరకు వుంటుందంటారు. ఇలా జగన్ వేసే ప్రతి అడుగులో విజయసాయి కనిపిస్తారు. ఎన్నికల ముందు వరకు ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా వున్న విజయ సాయి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వైసిపి ట్విట్టర్ పిట్టగా కనిపిస్తూ వినిపిస్తూ సంచలనాలు చేస్తూ వచ్చేవారు. ఇటీవల రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చాకా ఆయన దూకుడు బాగా పెరిగింది. కీలకమైన సున్నితమైన రాజధాని మార్పు పై ముఖ్యమంత్రి ప్రకటన ఇలా చేశారో లేదో విశాఖ సమీపంలోని భీమిలీలోనే క్యాపిటల్ అంటూ చేసిన వ్యాఖ్యలు అమరావతిలో అగ్గి రాజేశాయి.ఇది జగన్ అనుమతితోనే వ్యూహం లో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా లేక పార్టీలో తానే సుప్రీం అని చెప్పేందుకు చేశారో కానీ ఇది వైసిపి ప్రభుత్వానికి నష్టమే చేసింది. ఇంకా క్యాబినెట్ సమావేశం, కమిటీల నివేదికలపై చర్చ జరగకుండా విజయసాయి ఇలా చేయడమే విపక్షాల్లోనే కాదు సొంత పార్టీలోనూ చర్చకు దారి తీసింది. అందుకే విశాఖ ఉత్సవ్ కి వైజాగ్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ త్రి క్యాపిటల్స్ పై ఒక్కమాట మాట్లాడలేదు అంటున్నాయి వైసిపి వర్గాలు. జగన్ రాకకు ముందు స్వాగత ఏర్పాట్లకు అక్కడకు వెళ్లిన విజయసాయి అదే దూకుడు చూపించారు. కాబోయే రాజధాని ప్రకటన సందర్భంగా ఆయనకు సుమారు ముప్పై కిలోమీటర్ల మేర ప్రజలు స్వగతం పలుకుతారని నోరు జారారు. ఇలా ఇదొక్కటే కాదు అనేక సందర్భాల్లో సర్కారీ నిర్ణయాలను విజయసాయి ముందే చెప్పడంతో క్యాబినెట్ లకు, కమిటీలకు, చర్చలకు విలువలేదని చెప్పక చెబుతున్నట్లు అవుతుందన్న ఆందోళన ఫ్యాన్ పార్టీలోనే వినిపిస్తున్నా ఎవ్వరు నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పేవారు. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చింది బహు తక్కువే. కానీ క్యాబినెట్ కూర్పు లోను ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు కీలక అధికార్ల పోస్టింగ్స్ అన్ని తానే చూసేవారన్నది అందరికి తెలిసిందే. కానీ ఎక్కడా బయటపడకుండా అంతా బ్యాక్ ఆఫీస్ లోనే సాగిపోయేవి. ఇక వైఎస్సాఆర్ ఆత్మగా ప్రాచుర్యం పొందిన కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి వ్యవహారాలన్నీ తానే చూసేవారు. ఆయన అతి తక్కువ సందర్భాల్లోనే మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి ఉండేది. అదీ వైఎస్ తదనంతరమే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన మీడియా సమావేశాలు నిర్వహించిన సందర్భం కనిపించేది. కానీ ఇప్పుడు జగన్ – విజయసాయి బంధం గతంలో ఎన్టీఆర్ – చంద్రబాబు, వైఎస్ – కెవిపి ల మాదిరే వున్నా ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు ఆరోపణలు పాలు అవుతున్నారు. జగన్ తనకు పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యతను విజయసాయి పదేపదే బయటపెట్టుకోవడం మాత్రం వివాదాస్పదం కావడం గమనిస్తే ఇది అనుభవరాహిత్యమా ? వ్యూహమా అన్న చర్చే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది.