వంశీ బాటలో మరికొంతమంది...? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వంశీ బాటలో మరికొంతమంది...?

విజయవాడ, డిసెంబర్ 11, (way2newstv.com)
వైసీపీలో చేరకుండా అనర్హత వేటు పడకుండా ప్రత్యేక సభ్యుడి హోదా పొందిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలకు మార్గదర్శిగా నిలిచారనే చెప్పాలి. వల్లభనేని వంశీ విషయంలో టీడీపీ అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరతారనుకుంది. కానీ తాను టీడీపీలో ఉండలేనని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని, తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ కోరారు.దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించినట్లయింది. ఇది ఊగిసలాటలో ఉన్న టీడీపీ శాసన సభ్యులకు అవకాశం చిక్కినట్లయింది. 
వంశీ బాటలో మరికొంతమంది...?

తమ పార్టీలో చేరాలంటే పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో కొందరు పార్టీ మారాలని భావిస్తున్నా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో వెనక్కు తగ్గారు. అయితే తాజాగా వల్లభనేని వంశీ వ్యవహారం వారికి ఊపిరి ఇచ్చినట్లయింది.చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. కొడాలి నాని, పేర్నినాని వంటి మంత్రులు కొంతకాలంగా టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలోనే ఉన్నారు. వారిపై సామ,దాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇష్టంలేని కొందరు అంటీ ముట్టనట్లు ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పటికీ పెద్దగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా లేరు.కానీ తాజాగా వల్లభనేని వంశీ వ్యవహారంతో తిరిగి చంద్రబాబు ప్రతిపక్ష హోదాపై చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీకి మంగళవారం స్పీకర్ ప్రత్యేక సీటు కేటాయించిన తర్వాత వారు కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడతారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వల్లభనేని వంశీ వ్యవహారం తర్వాత చంద్రబాబు కూడా అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై జగన్ ఉచ్చులో చిక్కుకోవవద్దని, భవిష్యత్ తెలుగుదేశం పార్టీదేనని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే ఏదైనా జరగొచ్చని అంటున్నారు వైసీపీ నేతేలు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.