కర్నూలు, డిసెంబర్ 23, (way2newstv.com)
కేఈ కృష్ణమూర్తి.. రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఆయన టీడీపీలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా చక్రం తిప్పారు. వయోవృద్ధుడు కావడం, మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలను ఆయన మార్చుకోలేక పోవడం వంటి కారణాల నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి రాజకీయాలకు దూరమని ఈ ఏడాది ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఈ క్రమంలోనే తన కుమారుడు శ్యాంబాబును రంగంలోకి దింపారు. అదే పత్తికొండ నియోజకవర్గం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన శ్యాంబాబు.. ఓడిపోయారు.ప్రజల్లోనూ శ్యాంబాబుకు పెద్ద బలమైన మద్దతు లేక పోవడం గమనార్హం. ఆయనపై హత్య కేసు కూడా ఉండడంతో ప్రజలు శ్యాంబాబును పెద్దగా పట్టించుకోలేదు.
కేఈ దారెటు...
ఈ క్రమంలోనే శ్యాంబాబు ఘోరంగా ఓడిపోయారనే టాక్ కూడా ఉంది. కేఈ కృష్ణమూర్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అందరిని కలుపుకుని వెళ్లేవారని.. శ్యాంబాబుపై ఫ్యాక్షన్ రాజకీయ ఆరోపణలు రావడం కూడా పత్తికొండలో పెద్ద మైనస్ అయ్యింది. ఇక, రాజకీయాల్లో ఉన్నంత సేపూ.. కోట్ల కుటుంబంతో సై! అంటూ సవాళ్లు విసురు కున్న కేఈ కుటుంబం.. ఈ ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు సూచనల మేరకు చేతులు కలిపింది. ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసింది. అయినాకూడా ప్రజలు వీరి దోస్తీని బలపర్చలేకపోయారు.ఒకే ఒరలో రెండు కత్తులను ఇమడ్చలేక పోయారు. ఈ పరిణామంతో కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఓట్లు కోల్పోయిందనే వాదన కూడా ఉంది. ఇక, ఇటీవల కాలంలో పార్టీ ఓటమి తర్వాత కూడా కేఈ తన మనసు మార్చుకోలేదు. పార్టీలో ఉండి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుని, తాము వైదొలుగుతున్నట్టు ప్రకటించుకున్న పరిటాల సునీత కానీ, జేసీ దివాకర్‌రెడ్డి కానీ, ఇప్పుడు తమ వారసులు ఓడిపోయిన నేపథ్యంలో తామే ముందుకు వచ్చి .. రాజకీయంగా తమ సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా కేఈ కృష్ణమూర్తి మాత్రం టీడీపీ గురించి ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం.. టీడీపీలో తాను ఎదుర్కొన్న అవమానాలేనని ఆయన అనుచరుల వద్ద వాపోతున్నట్టు సమాచారం.పేరుకే డిప్యూటీ సీఎం అయినా.. తన అనుమతి లేకుండానే, తనకు తెలియకుండానే అనేక నిర్ణయాలు జరిగిపోయాయని గతంలోనే కేఈ కృష్ణమూర్తి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కుమారుడిపైనే భారం వేసి ఆయన రెస్ట్ తీసుకునేందుకే డిసైడ్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క, చంద్రబాబు సైతం ఈయనను పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆయన అనుచరులు, సన్నిహితులు మాత్రం కేఈ కృష్ణమూర్తి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారట. కేఈ కృష్ణమూర్తి రాజకీయాల్లో లేకుంటే కష్టమని భావించి ఆయనను తిరిగి రాజకీయాల్లోకి రప్పించేందుకు వత్తిడి తెస్తున్నారట. మరి కేఈ వారి విన్నపాన్ని వింటారో? లేదో? చూడాలి.