కాలుష్యం కమ్మేస్తోంది.. (మెదక్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలుష్యం కమ్మేస్తోంది.. (మెదక్)

మెదక్, డిసెంబర్ 09 (way2newstv.com): 
కాలుష్యం అంటేనే చాలు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయట కాలుపెడితే ఏదో ఒక రూపంలో కాలుష్యం ప్రజల పాలిట శాపంగా మారుతుంది. దీని వల్ల ఎప్పుడు ముప్పు వాటిల్లుతుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు రోజురోజుకు కనుమరుగవుతున్న వృక్షాలు, మరో పక్క నిత్యం విజృంభిస్తున్న కాలుష్యం మూలంగా ప్రజలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మెదక్‌ జిల్లాలో ముమ్మరంగా పరిశ్రమలను స్థాపించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు రహదారులు రవాణాకు అనుకూలంగా ఉండటం వల్ల పరిశ్రమల యజమానులు వీటిని ఏర్పాటు చేశారు. మొదట్లో పరిశ్రమలు వస్తున్నాయని వీటి వల్ల ఉపాధి లభిస్తుందని గ్రామాల్లో వాటి ఏర్పాటుకు ప్రజలు అనుమతులు ఇచ్చారు. 
కాలుష్యం కమ్మేస్తోంది.. (మెదక్)

కాని వీటిని ఏర్పాటు చేసిన తర్వాత అసలు స్వరూపం బయటపడుతుంది. ఉపాధి పక్కన పెడితే కాలుష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చేగుంట, చిన్నాశంకరంపేట, మనోహారాబాద్‌, తూప్రాన్‌, శివ్వంపేట మండలాల్లో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా అందిస్తున్న సాయంతో వాటి స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి స్థాపిస్తున్నారు. చాలా చోట్ల పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో చెరువులు, కుంటల్లోకి కాలుష్యాన్ని వదులుతున్నారు. ఆ నీటిని తాగే పశువులు చనిపోతున్నాయి. వాటిలోని చేపలు చనిపోతున్నాయి. నీరు భూగర్భంలోకి వెళుతోంది. కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూగర్భజలాలు కలుషితం కావటంవల్ల బోరుబావుల నుంచి కాలుష్యం నీరు వస్తుంది. పంటలు కూడా పండటం లేదు. ఒకప్పుడు గ్రామాల్లో విచ్చలవిడిగా పరిశ్రమలను స్థాపించేందుకు ప్రజలు సమ్మతించేవారు. ప్రస్తుతం పలు గ్రామాల ప్రజలు చైతన్య వంతులవుతున్నారు. ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఇప్పుడు ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మూకుమ్మడిగా పరిశ్రమల స్థాపనను వ్యతిరేకిస్తున్నారు. నార్సింగి మండలం సంకాపూర్‌, మనోహరాబాద్‌ మండలంలో ఇటీవల పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. కాలం చెల్లిన వాహనాల మూలంగా కాలుష్యం విపరీతంగా వస్తుంది. భారీ వాహనాలతో పాటు ద్విచక్రవాహనాల నుంచి కాలుష్యం విచ్చలవిడిగా వస్తుంది. ఈ వాహనాల వెనకాల వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అధికారులు సరిగా పట్టించుకోవటం లేదు. జిల్లాలో చాలా చోట్ల ఇనుము, రసాయనం తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి పొగను నిత్యం గాలిలోకి వదులుతున్నారు. ముఖ్యంగా చేగుంట, మహనోరాబాద్‌, చిన్నశంకరంపేట మండలాల్లో ఉన్న ఐరన్‌ పరిశ్రమల నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా గాలిలోకి వదులుతున్నారు. చేగుంటలో ఓ పరిశ్రమలు వదిలే పొగ వల్ల రహదారిపై వెళ్లే వారికి దారి కూడా కనిపించడంలేదు. ప్రతి రోజు ఇలా వదులుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటంలేదు. చేగుంట మండలంలో పలు గ్రామాల ప్రజలు ఉదయం, సాయంత్రం అయిందంటే ముక్కులు మూసుకుంటున్నారు. కర్నాల్‌పల్లి (చిన్నశివునూర్‌ గ్రామ పరిధి)లో ఉన్న ఓ పరిశ్రమను నుంచి నిత్యం దుర్గంధంతో పొగలు చుట్టుపక్కల వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. పాతటైర్ల నుంచి నూనెను తీసే పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమల మూలంగా వచ్చే కాలుష్యంతో చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.