పవనిజం... వెనకడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవనిజం... వెనకడుగులు

కాకినాడ, డిసెంబర్ 12, (way2newstv.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను చాలా సులువుగా తీసుకున్నట్లు కనపడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమికి కారణాలు వెతక్కుండా బెదిరింపులకు దిగుతుండటం చర్చనీయాంశమయింది. పవన్ కల్యాణ్ కు డెడ్ లైన్ లు విధించడం, తర్వాత వెనక్కు తగ్గడం కొత్తేమీ కాదు. సమస్య పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని గతంలో అనేక సార్లు ప్రకటించారు. ప్రభుత్వానికి డెడ్ లైన్లు కూడా విధించారు. అయితే ఆ తర్వాత పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గారు.తొలుత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని 2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే అది ఆచరణలో పెట్టలేదు. 
పవనిజం... వెనకడుగులు

తర్వాత ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం జరగకుంటే ఆందోళనకు దిగుతానని అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డెడ్ లైన్ కూడా విధించారు. అయితే బాబు ప్రభుత్వం ఉద్దాన కిడ్నీ బాధితులకు అరకొర సాయం ప్రకటన చేయడంతో మళ్లీ ఆ ఆలోచన విరమించుకున్నారు.తాజాగా మదనపల్లె టమాటా రైతు మార్కెట్లో రైతులను చూసి ఆవేదన చెందిన పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమవేశాల్లో రైతు సమస్యలను పరిష్కరించకపోతే అమరావతిలో భారీ బహిరంగ సభ పెడతానని హెచ్చరించారు. ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలోనూ ఆయన ఇదే విధమైన సంచనల ప్రకటన చేశారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే తాను నిరసన దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.ఇలా పవన్ వార్నింగ్ లు ఇచ్చి తాత్కాలికంగా అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ పార్టీలోనూ జరుగుతుంది. నిజానికి పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చి ఉద్యమాలు చేసే నేత కాదు. ఇందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులున్నాయి. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరో ఒకరు గాయాలపాలవుతున్నారు. తాను పాదయాత్ర చేయంది కూడా అందుకేఅని పవన్ కల్యాణ‌ పలుమార్లు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వానికి వార్నింగ్ లు డెడ్ లైన్ లు ఇవ్వడం మాత్రం పవన్ కల్యాణ్ వదిలిపెట్టడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ వార్నింగ్ లకు విలువ ఉందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ తాను డెడ్ లైన్, వార్నింగ్ ఇచ్చేముందు దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు సయితం భావిస్తున్నాయి