టీడీపీలో చీలిక తప్పదా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీలో చీలిక తప్పదా...

విశాఖపట్టణం, డిసెంబర్ 20, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బ తీయాలని అధికార వైసీపీ ప్లాన్‌లు వేసుకుంటోంది. ఇప్పటికే టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో బిజీగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీలో చీలిక తీసుకొచ్చే స్కెచ్‌ గీసేసిందని అంటున్నారు జనాలు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రాంతాల వారీగా దీనిని మద్దతు పలికే వారు ముందుకొస్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడ్డానికే జగన్‌ ఇలా లీకులిచ్చారని అంటున్నారు. కాకపోతే, జగన్‌ ప్రకటన ఒక్కసారిగా టీడీపీలో విభేదాలకు దారి తీసినట్టయ్యింది. 
టీడీపీలో  చీలిక తప్పదా...

సీఎం జగన్‌ ప్రకటన వెలువడిన తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. స్వాగతిస్తూ ట్వీటారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయొచ్చంటూ జగన్‌ ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేగా గంటా పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారిక నిర్ణయం వేరేగా ఉంది. ఇలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని టీడీపీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇదే సమయంలో గంటా లాంటి నేతలు మాత్రం జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.మరోపక్క ఉత్తరాంధ్రకే చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ కూడా జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తుంటే.. మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తామనడంలో తప్పు లేదంటున్నారు. కొద్దిమంది రైతుల కోసం టీడీపీ నేతలు మాట్లాడం సరికాదని.. సీఎం నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని చెప్పుకొచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. తాను మొదటి నుంచి ఈ విషయాన్ని కోరుకున్నానని.. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి అవకాశం ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు వేసిన ప్లాన్‌లో ఇప్పుడ ప్రాంతాల వారీగా టీడీపీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. ఏ ప్రాంతానికి సంబంధించిన నేతలు ఆ ప్రాంతానికి ప్రాధాన్యం వస్తుందని భావిస్తూ.. జగన్‌ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ప్రాంతాల వారీగా నాయకుల్లో చీలిక తప్పదని అంటున్నారు. దీనివల్ల టీడీపీకి ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో కన్‌ఫ్యూజ్‌ అవుతున్న తెలుగుదేశం పార్టీకి నేతల మధ్య భిన్నాభిప్రాయలు.. ముఖ్యంగా జగన్‌ నిర్ణయాన్ని కొందరు నేతలు సమర్థిస్తూ ఉండడం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు జనాలు. ఇప్పుడు దీనిని నుంచి టీడీపీ ఎలా బయట పడుతుందో చూడాలంటున్నారు