విజయవాడ, డిసెంబర్ 14, (way2newstv.com)
పీలో రాజకీయం నెమ్మదిగా మారుతోంది. సమీకరణలు కూడా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల ముందటి వాతావరణం అయితే ఇపుడు లేదు. నాడు జగన్ ని పల్లెతూ మాట కూడా అనని బీజేపీ నేతలు ఇపుడు ఆయన పేరు ఎత్తితేనే ఇంతెత్తున లేస్తున్నారు. మరో వైపు జగన్ ని మతం కార్డుతో కార్నర్ చేయాలన్న వ్యూహాలు అమలవుతున్నాయి. అదే పనిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. మత రాజకీయాలపైన మండిపడే వామపక్షాలు దీన్ని గట్టిగా ఖండించడంలేదు, అలాగనీ సమర్దించడం కూడా లేదు.ఇక ఏపీలో జగన్ పాలన పట్ల అన్ని పార్టీలు గట్టిగానే విమర్శలు చేస్తూంటే కామ్రెడ్స్ కూడా తమ గొంతు విప్పుతున్నారు. ఇందులో సీపీఐ స్వరం ఒకలా ఉంటే సీపీఎం మరొలా స్పందించడమే రాజకీయ విశేషం. సీపీఐ మొదటి నుంచి జగన్ అంటే కాస్త ఎడం పాటిస్తూనే ఉంది.
ఏపీలో సీపీఎం, వైసీపీ దోస్తి
సీపీఎం మాత్రం జగన్ పట్ల ఇపుడిపుడే తన ఆలోచనలు మాచుకుంటోందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ఈ మధ్యనే ఉన్న పళంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుని ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అది ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనమే అయింది. ఆ తరువాత నుంచి సీపీఎం కూడా జగన్ విషయంలో నెమ్మదిగానే మాట్లాడుతోంది.పదేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం టీఆర్ఎస్, వామపక్షాలు కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో మొదట టీఆర్ఎస్ వెళ్ళిపోయింది. తరువాత వామపక్షాలు కూడా బాబు నుంచి దూరం అయ్యాయి. 2014 ఎన్నికల్లో బీజేపీతో బాబు పొత్తు పెట్టుకోవడంతో వైసీపీతో కలసి నడవాలని కామ్రేడ్స్ అనుకున్నాయి కానీ జగన్ ఒంటరి పోరుకే ప్రాధాన్యత ఇవ్వడంతో అది కుదరలేదు. 2019 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ జనసేనతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ జత కట్టాయి. చేదు ఫలితాలు రావడంతో ఈ బంధం బీటలు వారింది. ఇపుడు పవన్ అడుగులు బీజేపీ వైపుగా సాగుతున్నాయి. మోడీ, అమిత్ షాలను మించిన నేతలు దేశంలో లేరని పవన్ పొగడడం కామ్రేడ్స్ కి కన్నెర్రగా ఉంది. ఇదే టైంలో చంద్రబాబు అమరావతి మీద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ హాజరైతే సీపీఎం రామని తెగేసి చెప్పింది. ఇక్కడ కామ్రెడ్స్ తో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ తో పొత్తు పెటాకులు అయిన వేళ కొత్తగా మళ్ళీ బాబుతోనే బంధం పెనవేసుకోవాలని సీపీఐ భావిస్తున్నట్లుగా అర్ధమవుతోందంటున్నారు.ఇక బాబుతో కలవకుండా, పవన్ తో విడాకులు అయ్యాక సీపీఎం కొత్త రాజకీయ బంధం ఎటువైపు అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు రెండూ ఒకటిగా పోరాటాలు చేసి జనసేనతో కలసినా సుఖం లేనపుడు విడిగానే రాజకీయ అజెండా కూడా ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే వైసీపీతో భవిష్యత్తులోనైనా సీపీఎం బంధం కుదరవచ్చునన్న అంచనలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకూ సీపీఎం జగన్ ని ఎక్కడా కఠినంగా మాట్లాడింది లేదు, పైగా జగన్ అధికారంలోకి వచ్చాక మొదట్లో అమలు చేసిన కొన్ని నిర్ణయాలను మెచ్చుకుంది కూడా. ఇక జగన్ విషయంలో కొంత క్లారిటీ కోసమే ఆ పార్టీ వేచి చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవను అన్న నమ్మకం ఏర్పడితే మాత్రం వైసీపీతో కలసి నడిచేందుకు సీపీఎం కి పెద్దగా ఇబ్బందులు అయితే లేవన్నది వాస్తవం అంటున్నారు.జగన్ 22 మంది ఎంపీలను గెలిపించుకున్నా కూడా బీజేపీ సర్కార్ లో చేరకపోవడం సీపీఎం వంటి పార్టీలకు అనుకూలించే అంశమే. అదే సమయంలో జగన్ ఓటు బ్యాంక్ సైతం బీజేపీకి భిన్నమైనందువల్ల ఆయన కమలంతో కలవరు అన్నది కూడా ఆ పార్టీకి ఉన్న మరో అంచనాగా చెబుతారు. అయితే ఇపుడు కేంద్రంలో బలంగా బీజేపీ ఉంది. పైగా ఏపీకి భారీ సాయం కావాలి. ఎన్నికలకు నాలుగున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి జగన్ రాజకీయం అంత తొందరగా బయటపడే అవకాశం అయితే లేదు. ఏ మాత్రం మోడీ హవా కేంద్రంలో తగ్గినా బీజేపీ క్రేజ్ కరిగినా ఆ మరుక్షణమే ఏపీలో వైసీపీ రాజకీయం మొదలవుతుందని అంటున్నారు. అపుడు సీపీఎం లాంటి పార్టీలు కూడా జత కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.