విజయవాడ, డిసెంబర్ 23, (way2newstv.com)
పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం అలా బయటపడుతూనే ఉంది. ఆయన జగన్ వ్యతిరేక అజెండా పార్టీ కొంప ముంచుతోంది. ప్రతీ అంశాన్ని జనం కోణం నుంచి కాకుండా జగన్ కోణం నుంచి పవన్ కల్యాణ్ ఆలోచించడంతో ఆయన రాజకీయంగా ఫెయిల్ అవుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాధనను బీజేపీ పెద్దలు పూర్తిగా స్వాగతించాకనైనా పవన్ కల్యాణ్ సైతం తన ఆలోచనలు మార్చుకుంటే బాగుండేది. కానీ ఆయన జనసేనాని కదా అందుకే జగన్ ని ఏమైనా అంటాను అంటూ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. అమరావతి కట్టలేని జగన్ మూడు రాజధానులు ఎలా అభివృధ్ధి చేస్తారంటూ వెటకారం ఆడారు. జగన్ ని విమర్శించాలన్న ఆత్రుతలో ఆయన అమరావతి రాజధాని అన్నది లేదన్న సత్యాన్ని చెప్పకనే ఒప్పేసుకున్నారు.
మళ్లీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జనసేనాని
నిజానికి జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలు వింటే ఎవరికైనా అర్ధమయ్యేది ఒక్కటే. లక్ష కోట్లు ఈ ప్రభుత్వం కాదు కదా మరే ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదు. అందువల్ల ఉన్నంతలో మంచిగా పాలన చేసుకునే వీలు చూసుకోవాలి. అదే విధంగా అమరావతి నిర్మాణాలు అయినకాడికి పూర్తి చేసి మిగిలిన భూమిని రైతులకు ఇచ్చేయాలన్నది వైసీపీ సర్కార్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఏపీలో మరో రెండు కీలక ప్రాంతాలు ఉన్నాయి. అవి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు. అవి అభివృధ్ధికి ఆమడ దూరాన ఉన్నాయి. అక్కడ పాలనారాజధాని, న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలన్నది జగన్ సర్కార్ ప్రతిపాదన, కర్నూలు కానీ, విశాఖ కానీ ఇప్పటికే నగరాలుగా ఉన్నాయి. అక్కడ కొత్తగా కొన్ని భవనాలు కట్టుకుంటే సరిపోతుంది. దానికి లక్షల కోట్లు అవసరం లేదు. మరి ఈ విషయం పవన్ కల్యాణ్ కి అర్ధమైందో లేదో కానీ మూడు నగరాలు కట్టడం అంటున్నాడు జనసేనాని.పవన్ కల్యాణ్ కోరి మరీ వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నాడంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రాజధాని వస్తే ఆ ప్రాంతాలు అభివ్రుధ్ధి చెందుతాయి. అదే విధంగా రాయలసీమకు శ్రీ బాగ్ ఒప్పందం ఒకటి ఉందన్న సంగతి పాలకులు డెబ్బయ్యేళ్ళుగా మరచిపోయారు. మరి దాన్ని గౌరవిస్తూ అక్కడ హైకోర్టు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకుంటే పవన్ కల్యాణ్ వ్యతిరేకించడం పూర్తిగా దివాళాకోరు రాజకీయమేనని అంటున్నారు. పవన్ కల్యాణ్ తాను ఇపుడు అభిమానిస్తున్న బీజేపీ నేతలే వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నారు. వారే జగన్ ప్రతిపాదనలకు స్వాగతం చెబుతున్నారు. మరి పవన్ కల్యాణ్ ఈ రాజకీయ సమీకరణలు సైతం బేరీజు వేసుకోకుండా గుడ్డిగా జగన్ ని అవును అంటే తాను కాదు అనాలనే పద్దతి పెట్టుకున్నట్లుగా ఉంది.ఎన్నికల్లో ఘోరంగా ఓడాక ఆరు నెలల రాజకీయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా బాబు గొంతుకగా మారిపోయారని అంతా అంటున్నారు. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు లాంటి వారైతే సొంత పార్టీ అధినేతగా సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదా పవనూ అంటూ గట్టిగానే కౌంటర్లేస్తున్నారు. పవన్ కల్యాణ్ చంద్ర బాబు అడుగుజాడల్లో నడిస్తే ఆయనకు ఏ రకమైన ఉపయోగం ఉంటుందో కూడా జనసేన నాయకులకే అర్ధం కాని పరిస్థితి ఉంది. మొత్తానికి పవన్ కల్యాణ్ నిండా జగన్ ద్వేషంతోనే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారంటే నిజం ఉంది కదా జనం కూడా ఇపుడు అంటున్నారు.