ధింసా పేటెంట్ కోసం కళకారుల ఆరాటం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధింసా పేటెంట్ కోసం కళకారుల ఆరాటం

వైజాగ్,  డిసెంబర్ 19, (way2newstv.com)
అరుకు అందాల గిరిసీమల జన ఆనంద నాట్యకేళి ధింసా. మన్యం వాసుల నృత్య గీతిక గిరిజన సంప్రదాయాలకు దీపికైన ధింసా నృత్యానికి, ఆ నృత్యం చేతున్న కళాకారులకు ప్రస్తుత కాలంలో ఆదరణ కరువైంది. ఈ నృత్యం ప్రస్తుత కలం లో కేవలం అధికారిక కార్యక్రమాల్లో పర్యాటకులను ఆకర్షించడానికే కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారుల దుస్థితి దయనీయంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజనుల సంప్రదాయ నృత్యం థింసా. ఈ పదం ఆదివాసీ నానుడి నుంచి వచ్చింది. ఈ పదానికి దీనికి అభినయం అని అర్థం వస్తుంది. గిరిపుత్రుల మనోభావాలను, ప్రతిబింబిస్తూ పాటలు పాడుతూ, సంప్రదాయ వాయిద్యాలు లయబద్ధంగా మ్రోగుతుంటే మహిళలంతా జట్టు కట్టి చేసే ఆనంద నృత్యమే థింసా. 
ధింసా పేటెంట్ కోసం కళకారుల ఆరాటం

పురుషులు గిరిజన సంప్రదాయ డప్పు, సన్నాయి, కొమ్ముబూరలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసంగా 10 నుంచి 22 మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు. విశాఖ ఏజెన్సీ, ఒడిషా సరిహద్దు గిరిజనులు ఈ థింసా నృత్యాన్ని తమ సంప్రదాయ నృత్యంగా ఆచరిస్తుంటారు. గిరిజనుల గ్రామ దేవతలను పూజిస్తూ సామూహికంగా బొడా థింసా, స్త్రీ, పురుషులిద్దరూ పక్షుల ఆరుపులను అనుకరిస్తూ లయబద్ధంగా వలయాలు చుడుతూ ఉద్రేకపూరితంగా చేసే గుండేరి థింసా అంటే పక్షి నృత్యం. ఇలా విభిన్న రకాలుగా థింసాను వర్గీకరించారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విభిన్న గిరిజన తెగల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఈ నృత్యం తీర్చిదిద్దారని చెబుతారు. గిరిజనులు పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం గూడెంలో సేదతీరే సమయంలో ప్రతి నిత్యం ఆడిపాడే నృత్యంగా మొదలైన థింసా.. తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది. దేశ, విదేశీ ప్రముఖలు రాష్ట్రానికి, జిల్లాకు విచ్చేసిన సమయంలో, పర్వదినాలు, శుభకార్యాల్లో గిరిజన కళాకారులతో ఈ థింసా నృత్యం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నృత్యరీతి పలువురిని ఆకట్టుకోవడంతో దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. విశాఖ మన్యంలోని అరకు, పాడేరు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత నేపథ్యంలో పర్యాటకుల కోసం ప్రతినిత్యం థింసా నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. థింసాను కూచిపూడి తరహాలో రాష్ట్ర అధికారిక నృత్యంగా ప్రకటిస్తామని సీఎం చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఇంకా ఆయన హామీ వాస్తవరూపం దాల్చకుండానే.... ఒడిశా మేధావులు, కళాకారులు కొత్త వాదన బలంగా వినిపిస్తున్నారు. థింసా నృత్యం తమ రాష్ట్రానికి చెందిన కళావారసత్వమని, పేటెంట్‌ కోసం యత్నిస్తున్నామని, ఏపీకి ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నారు.విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం చట్రాయిపుట్టు గ్రామం థింసా నృత్యం పుట్టిల్లుగా కీర్తినొందింది. భారతదేశ వ్యాప్తంగా థింసా నృత్యం చేసిన ఘనత చట్రాయిపుట్టు గిరిజన మహిళలకే దక్కింది. పూర్వం దేవతామూర్తులు కూడా ఈ నృత్యం ఆడేవారని, ఇందుకు ఆధారంగా చట్రాయిపుట్టుకు సమీపంలోని సీతమ్మ కొండపై థింసా నృత్యం మాదిరిగా వరుసలో ఉండే శిలలను గిరిజనులు చూపిస్తుంటారు. పగలంతా అడవికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చే గిరిజనులు సేదతీరే క్రమంలో ఆడిపాడే నృత్యం థింసాగా 1970వ దశకంలో ప్రాచుర్యం పొందింది. విషయం ఆ నోటా.. ఈనోటా 1980లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలిసింది. థింసా నృత్యం చూడాలని ఉందని ఆమె కోరడంతో అప్పటి విశాఖ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు చట్రాయి పుట్టికి చెందిన గిరిజనులను ఢిల్లీకి తీసుకు వెళ్లి అక్కడ ధింసా నృత్యం ఏర్పాటు చేయించారు. థింసా చూసి ముగ్ధురాలైన ఇందిర గిరిజనులతో కలిసి నృత్యం చేశారని అప్పటి జ్జాపకాలను కళాకారులు చెబుతున్నారు.థింసా నృత్యం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కానీ తరతరాల నుంచి ఆ నృత్యం చేయడం అక్కడి మహిళలకు ఆచారంగా మారింది. థింసా నృత్యం విశాఖ ఏజెన్సీలోనే పుట్టిందనేందుకు ఆధారాలున్నాయి. ఒడిశాలోని నృత్యంకు, మన విశాఖ ఏజెన్సీలోని థింసా నృత్యంకు చాలా తేడా ఉంది. నాలుగైదు భంగిమల్లో  మహిళలు థింసా నృత్యమాడుతారు. ఒడిశాలో మాత్రం శరీర అవయావాలు పూర్తిస్థాయిలో కదలకుండానే నృత్యం చేస్తారు. విశాఖ మన్యం ధింసాకు పేటెంట్ హక్కులు కల్పించి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని ధింసా న్రుత్యానికి ఉన్న ఆధరణ దృష్ట్యా కళాకారలను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి సరైన భృతి కల్పించాలని కళాకారులు కోరుతున్నారు.