మారని విశాఖ రూపు రేఖలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మారని విశాఖ రూపు రేఖలు

విశాఖపట్టణం, డిసెంబర్ 24, (way2newstv.com)
ర్ట్‌ సిటీగా విశాఖ ఎంపికై నాలుగున్నరేళ్లవుతోంది. ఈ పథకంతో విశాఖ రూపు రేఖలు మారిపోతాయని, అమెరికా సాయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలబెడతామంటూ బిజెపి ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఇప్పటి వరకూ నాలుగోవంతు ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. నగరంలోని పౌరసేవలను విస్మరించి పన్నుల ద్వారా వచ్చిన సంపదను ఒకే చోట కుమ్మరించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంతో పాటు అందులోంచి ప్రజా ప్రతినిధులు, ఇంజినీర్లు కమీషన్లు దండుకోవడం తప్ప విశాఖ నగర సమగ్రాభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం కోసమే స్మార్ట్‌సిటీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
మారని విశాఖ రూపు రేఖలు

దేశంలోనే అత్యధికంగా మురికివాడలు ఉన్న నగరంగా విశాఖ పేర్గాంచింది. 47 శాతం ప్రజలు ఇక్కడ మురికివాడల్లోనే నివసిస్తున్నారు. వీటిల్లో తాగునీటి సరఫరా అంతంత మాత్రమే. మధురవాడ, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమిలి విలీన ప్రాంతాల్లో తాగునీరు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బిటి రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటుకాక మట్టిరోడ్లపైనే ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. వర్షం వస్తే ఆ రోడ్లపై ప్రయాణం నరకమే. నగరంలో 1.50 లక్షల మంది సొంతిల్లు లేక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నగరంలో ఏ మూలచూసినా కాలుష్యం కోరలు చాచుకుని ఉంది. మున్సిపల్‌ పాఠశాలలు, జెడ్పీ హైస్కూళ్లను నిర్వీర్యం చేశారు. వైద్యరంగాన్ని కుదేలు చేసి 27 జివిఎంసి డిస్పెన్సరీలను ఈ-వైద్యం పేరుతో ప్రయివేటుకు కట్టబెట్టారు. పార్కులు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలను పిపిపి పేరుతో ప్రయివేటువ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఇంటి పన్నులు పెరిగాయి. తడి, పొడి చెత్త పేరుతో పన్నుల వసూళ్లు మొదలు పెట్టారు. దోమలు విజృంభిస్తున్నాయి. ఏటా పెద్ద ఎత్తున డెంగ్యూ, మలేరియా జ్వరాలతో పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపే మౌలిక సదుపాయాలు కల్పించకుండా అత్యధిక ప్రాంతాలను విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో విశాఖను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేశామంటూ గొప్పలు చెప్పి, 20 లక్షల జనాభా కలిగిన విశాఖలో కేవలం ఆర్‌కె బీచ్‌, పాండురంగాపురం, కిర్లంపూడి లే అవుట్‌, దసపల్లా లే అవుట్‌ కలిగిన 1700 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే స్మార్ట్‌ అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. 531 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన జివిఎంసిలో స్మార్ట్‌కోసం ఎంపిక చేసిన 1700 ఎకరాలు మొత్తం విస్తీర్ణంలో 0.6 శాతమే. ఇక్కడ కేవలం 60 వేల మంది నివసిస్తున్నారు. ఇంత తక్కువ ప్రాంతంలో తొలుత రూ.1602 కోట్లతో 70 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత అంచనాలు పెంచి రూ.2909.90 కోట్లకు ఖర్చును పెంచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఇప్పటికే నాలుగేళ్లవుతున్నా రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. మరో రూ.200 కోట్లు కాగితాల్లోనే తప్ప ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (జివిఎంసి) ఖాతాలోకి జమకాలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) సొంతంగా రూ.1909 కోట్లు సమకూర్చుకోవాలి. అందుకోసం నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి కొద్దిపాటి ప్రాంతంలో ఖర్చు చేస్తున్నారు. మరోవైపు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇంతకీ ఇక్కడ చేస్తున్న అభివృద్ధి ఏలా ఉందంటే.. మంచి రోడ్లను తవ్వేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌ పేరుతో రోడ్లను ఇరుకుగా మారుస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.ఐదు వేలు ఖర్చు పెట్టి ఇక్కడ నాటుతున్నారు. అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ పేరుతో రోడ్లను ఇష్టానుసారం గుంతలు పెట్టారు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. నివాసాల్లోని విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు అమరుస్తున్నారు. తాగునీటికీ మీటర్లను పెడుతున్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ సిటీ నిధులు ఖర్చు చేసిన ప్రాంతాల్లోని ప్రజలు ప్రతి సేవకూ పన్నులు చెల్లించాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.