మూడు రాజధానుల కాన్సెప్ట్ లో ఏదీ ముందు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు రాజధానుల కాన్సెప్ట్ లో ఏదీ ముందు

కర్నూలు, డిసెంబర్ 28, (way2newstv.com)
మూడు రాజధానులుగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనను వికేంద్రీకరిస్తామంటూ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదనలో ఏది ముందు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే రూపుదాల్చిన అమరావతి విషయంలో పెద్దగా చేయాల్సిన కార్యకలాపాలు ఏమీ ఉండకపోవచ్చు. మిగిలిన రెంటి విషయంలోనే కొంత సందిగ్ధత. ముఖ్యంగా హైకోర్టు విషయంలో సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు అవకాశాలున్నాయంటున్నారు రాజ్యాంగనిపుణులు. ప్రభుత్వ పరిధిలో పాలన సౌలభ్యం కోసం నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు అధికారపార్టీకి ఉంటుంది. దీనికి చట్టపరంగా కేంద్రప్రభుత్వ అనుమతితో పెద్దగా నిమిత్తం ఉండదు. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోకే వస్తుంది. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని ఆర్టికల్ అయిదు, ఆరు ప్రకారం కొంత బాధ్యతలు మాత్రం కేంద్రానికి దఖలు పడ్డాయి. 
మూడు రాజధానుల కాన్సెప్ట్ లో ఏదీ ముందు

వాటిని ఇప్పటికే పూర్తి చేసింది. రాజధానిలోని రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి ప్రధాన భవనాల నిర్మాణాలకు నిధులు సమకూర్చే బాధ్యతను సైతం నిర్వర్తించామని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. దాంతో కేంద్రం బాధ్యత సాంకేతికంగా ముగిసింది. ఇక నూతన సర్కారు నిర్ణయం మేరకు మూడు రాజధానుల కాన్సెప్టులో విశాఖ, కర్నూలు లో ఏది ముందుగా సాకారమవుతుందనే చర్చ మొదలైంది.ప్రాంతాల వారీ భావోద్వేగాలు మిళితం అయ్యేలా మూడు రాజధానుల ప్రకటనకు ముఖ్యమంత్రే నాంది పలికారు. దాంతో శషభిషలకు తావులేని సర్కారీ నిర్ణయంగానే దానిని చూడాలి. అంతేకాకుండా అధికార పార్టీలో నంబర్ టు గా పేర్కొనే విజయసాయి రెడ్డి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతోందంటూ తాజాగా పదేపదే చెబుతున్నారు. పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ గడచిన రెండు మూడు నెలలుగా రాజధాని అమరావతిపై సందేహాలు, అనుమానాలు లేవనెత్తుతూ ప్రజల్లో గందరగోళానికి, చర్చకు తెర తీశారు. విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ లో చెప్పిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగి ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలకు ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అందువల్ల భీమిలి ప్రాంతం ఎంపిక మొదలు ఆయన చేస్తున్న ప్రకటనలను అధికారికంగానే భావించాల్సి ఉంటుంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించి నిర్ణయించిన తర్వాత చేయాల్సిన ప్రకటనలను ముందస్తుగానే నాయకులు ప్రకటించడమే వివాదాస్పదం. దీనివల్ల మంత్రిమండలి నిర్ణయాలకుండే పవిత్రత, నైతికత కొంత దెబ్బతింటుంది. మంత్రిమండలి పట్ల ప్రజల్లో ఉదాసీనభావం నెలకొనే ప్రమాదం ఉంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లలో, హోంమంత్రిత్వ శాఖ గెజిట్లలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తాజాగా రాజధాని మార్పు అంటే కేంద్రంతో మళ్లీ సంప్రతింపులు జరపాల్సి ఉంటుంది. తన అభ్యర్థనను తెలపాల్సి ఉంటుంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం వైసీపీ ప్రభుత్వం అందుకు పూనుకోకపోవచ్చని తెలుస్తోంది. పొలిటికల్ క్యాపిటల్ గా అధికారికంగా అమరావతే కొనసాగుతుంది. దీనివల్ల కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. సెక్రటేరియట్ వ్యవహారాలను మాత్రం విశాఖకు తరలిస్తారు. దీనికి కేంద్రం అభ్యంతరం పెట్టదు. అంతేకాకుండా న్యాయపరంగా వచ్చే వ్యాజ్యాలు, వివాదాలకు సైతం రాష్ట్రప్రభుత్వం సులభంగానే సమాధానాలు దాటవేయగలుగుతుంది. రాజధానిని తరలించలేదు. పరిపాలనను వికేంద్రీకరించామని సాంకేతికంగా సమర్థించుకునే సౌలభ్యం సమకూరుతుంది. ప్రజల దృష్టిలో మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ కు విస్త్రుత ప్రచారంతోపాటు ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆకట్టుకునే అవకాశం చిక్కుతుంది. ఈ ఏర్పాటు వల్ల చట్టపరమైన చిక్కులు పెద్దగా ఎదురుకావనే అంచనాలో ఉంది వైసీపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక వెసులుబాటు చిక్కుతుంది. అమరావతి రాజధాని విస్తరణ కార్యకలపాలను కుదించుకున్న నేపథ్యంలో కొత్తగా నిధులు మంజూరును నిలిపివేయవచ్చు. గతంలోనే 47 వేల కోట్ల రూపాయలు నిధులను రాజధాని నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించి ఉంది. దానిని కేంద్రం చాకచక్యంగా పెండింగులో పెట్టేయవచ్చు.సెక్రటేరియట్ తరలింపు అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పటికే కేంద్రన్యాయశాఖ అనుమతులు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నోటిఫికేషన్ల మేరకు వెలసిన హైకోర్టు తరలింపు అనేది అంత సులభసాధ్యమైన అంశం కాదు. రాష్ట్రప్రభుత్వ అభ్యర్థన, హైకోర్టు నివేదిక, కేంద్ర అంగీకారం, అంతిమంగా సుప్రీం కోర్టు అనుమతులతో హైకోర్టు తరలింపు ఆధారపడి ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. రాష్ట్రప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయానికి అన్ని స్థాయుల్లోనూ గ్రీన్ సిగ్నల్ వస్తేనే సాధ్యమవుతుంది. ఒకవేళ ఎక్కడేని ఆటంకాలు తలెత్తితే అధికారంలో ఉన్న పార్టీ రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రాంతాలవారీ భావోద్వేగాలు బలంగా వ్యాపించాయి. విశాఖలో సెక్రటేరియట్ కార్యకలాపాలు ముందుగా మొదలై, కర్నూలుకు హైకోర్టు తరలింపు సాకారం కాకపోతే రాయలసీమలో సెంటిమెంటు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. రెంటికీ చెడ్డ రేవడిలా తాము నష్టపోయామనే భావన అక్కడ నెలకొంటే కష్టమే. అంతేకాకుండా ఉత్తరాంధ్ర కంటే రాయలసీమలో ఉద్యమ స్వభావం ఎక్కువ. వైసీపీ తాను ఆశించిన వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలంటే ముందుగా కర్నూలు హైకోర్టు విషయాన్ని క్లియర్ చేసుకోవాలనేది వైసీపీ శ్రేయోభిలాషుల సూచన. పైపెచ్చు హైకోర్టును తమకు కేటాయించాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. సెక్రటేరియట్ కావాలంటూ ఉత్తరాంధ్రలో పెద్దగా డిమాండ్ లేకుండానే ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఆందోళన సాగిస్తున్న తమ స్వప్నం సాకారం కాకుండా విశాఖలో సెక్రటేరియల్ వెలసి కార్యకలాపాలు ఊపందుకుంటే తాము మరింత అన్యాయానికి గురయ్యామనే ఆవేదన రాయలసీమ వాసుల్లో నెలకొనే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగూరకతతో వ్యవహరించాలి. లేకపోతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి చందంగా అడకత్తెరలో ఇరుక్కునిపోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల విభజన అంశం పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఎంతకాలం తీసుకున్నదీ అందరికీ తెలిసిన అంశమే. మూడు రాజధానుల అంశం లో సర్కారు ఆప్రమత్తంగా వ్యవహరిస్తూ జ్యుడిషియల్ క్యాపిటల్ విషయాన్ని ముందుగా తేల్చేయడమే సముచితం.