విజయవాడ, డిసెంబర్ 31 (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్ కి రాజకీయ ఎత్తులు తెలియవు, ఆయనది అంతా ముక్కుసూటి వ్యవహారం అంటారు. అది ఏడు నెలల పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన అనుకున్నట్లుగానే చేసుకుంటూ ముందుకువెళ్ళారు. అది ఇసుక పాలసీ అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, మద్య నిషేధం అయినా కూడా జగన్ దే ఫైనల్ డెసిషన్. ఇపుడు మూడు రాజధానుల ముచ్చట కూడా జగన్ తీసుకున్న నిర్ణయం అని విపక్షాలు అంటున్నాయంటే పార్టీలో మిగిలిన వారి సంగతి చెప్పనక్కలేదు. ఇక జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా రాజకీయ లాభనష్టాల మీద పెద్ద ఎత్తున చర్చ మొదలవుతోంది.జగన్ అమరావతి నుంచి రాజధానిని కదల్చాలనుకోవడం వెనక వ్యూహాలు పెద్దగా లేవని రాజకీయ మేధావులు అంటున్నారు. ఆయనకు అమరావతిలో రాజధాని నిర్మాణం పెద్ద భారం అయింది.
అనుకున్నది చేసుకుంటూ...
దాన్ని అక్కడే ఉంచి పాలన చేసినా కూడా అభివృధ్ధి ఆగిందని విపక్షాలు అంటాయి. రాజధాని కట్టమని ప్రతి రోజూ సతాయిస్తాయి. డబ్బులు లేవని చెప్పినా వినే నాధుడు లేడు. అసమర్ధ పాలన అనేస్తారు. అందుకే ఏడు నెలల తరువాత జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాజధాని ప్రాంతం అమరావతి కధకు ఇంతే సంగతులు అని పేర్కొంటున్నారు.ఇదిలా ఉండగా అమరావతి కధ అంతటితో ఆగదుగా, రాజకీయంగా వైసీపీఎని దెబ్బతీసేలా ఉందని సొంత పార్టీ నేతలే కలవరపడుతున్నారు. అయితే వారు బయటకు చెప్పలేకపోతున్నారు. అమరావతి రాజధాని తరలిస్తే మాత్రం క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ మళ్ళీ గెలవడం అసాధ్యమన్న భావన కూడా అంతటా ఉంది. ఆ విధంగా టీడీపీకి ప్రాణం పోసినట్లేనని అంటున్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఏడు నెలల్లోనే ఏ రకమైన పోలింగ్ లేకుండానే ఆ జిల్లాలు జగన్ వదిలేసుకున్నట్లైందని కూడా విశ్లేషిస్తున్నారు.ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు తీరు చూస్తే ఇవి టీడీపీకి పట్టుకొమ్మలు. ఎపుడూ లేని విధంగా జగన్ ని సీఎం గా చేసి ముచ్చటపడ్డాయి. అయితే ఈ గాలివాటాన్ని చూసి రేపటి గెలుపు మనదేనని జబ్బలు చరచుకుంటే ముప్పు తప్పదని రాజకీయం తెలిసిన వారు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ అభివృధ్ధి ఎంత చేసినా కులాలు, పార్టీ బలాబలాల బట్టే ఓటింగు ఉంటుంది. . ఉత్తరాంధ్ర వైసీపీని ఆదరిస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. మరి దీన్ని జగన్ ఎంతవరకూ మారుస్తారో చూడాలిఅమరావతిలో ఉంటే ఉక్కబోతగా జగన్ కి ఉన్నట్లుంది. ప్రతీ రోజూ మా కలల రాజధానిలో జగన్ ఉండి పాలన చేస్తున్నారని టీడీపీ పెద్దల ఎత్తిపొడుపులు జగన్ కి భరించలేనివిగా ఉన్నాయని కూడా అంటున్నారు. తనదైన మార్క్ పాలన చూపించుకోవడానికి కూడా జగన్ రాజధాని మార్పు తలపెట్టారని కూడా విశ్లేషిస్తున్నారు. ఎన్ని చేసినా కూడా విశాఖలో జగన్ వరకూ సౌకర్యవంతంగా ఉంటుంది తప్ప, రాజకీయంగా అసలైన ఇబ్బందులు వైసీపీకి ఇప్పటినుంచే మొదలవుతాయని సొంత పార్టీ నుంచే సందేహాలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.