గుంటూరు, డిసెంబర్ 9, (way2newstv.com)
రాజకీయాలంటేనే అలాగే ఉంటాయి. ఆ సంగతి కొత్తగా వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి అర్ధమైనంతగా సుదీర్ఘ చరిత్ర ఉన్న వామపక్షాలకు తెలియకపోవడమే ఇక్కడ విడ్డూరం. ఏపీలో కొత్త రాజకీయాన్ని రూపొందిద్దామని కామ్రెడ్స్ జనసేనతో 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఇంత చేసినా అటు పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు, మరో వైపు వామపక్షాలు కూడా ఉన్న ఉనికిని మరింతగా కోల్పోయాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికల ఫలితాల తరువాత అయినా గట్టిగా పోరాటాలు చేద్దామని వామపక్షాలు అనుకుంటే పవన్ కళ్యాణ్ తీరే వారిని ఇబ్బంది పెడుతోంది. దాంతో వారు జనసేనాని పోకడలను జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. అందుకే విశాఖ లాంగ్ మార్చ్ జరిగినా కూడా పవన్ పిలిస్తే వెళ్ళకుండా దూరం పాటించారు.
ఆచితూచి అడుగులేస్తున్న జనసేనాని కళ్యాణ్
పవన్ కళ్యాణ్ బీజేపీకి కన్నుగీటుతున్న సంగతి తెలిసే వామపక్షాలు ఎన్నికల తరువాత వ్యూహాత్మకంగా పక్కకు జరిగాయి. అది నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ జై బీజేపీ అంటున్నారు. ఆయన ఈ దేశానికి మోడీ, అమిత్ షా కరెక్ట్ అంటున్నారు. ఆ ఇద్దరూ ఎవరినైనా తొక్కి పారేస్తారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. దీంతో కామ్రేడ్స్ కి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసినా అమిత్ షా కరెక్ట్ అంటారా అంటూ గట్టిగా తగులుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీజేపీ విషయంలో అసలు వాస్తవాలు తెలుసుకోవాలంటూ కామ్రేడ్స్ రామక్రిష్ణ, మధు గట్టిగానే కోరుతున్నారు.కళ్యాణ్ విషయం చూసుకుంటే జనసేన పార్టీని మరో నాలుగున్నరేళ్ళ పాటు నడిపించాలి. చూస్తే పార్టీకి ఎక్కడా బలం లేదు, ఆర్ధికంగా గట్టిగా ఉన్న నేతలు లేరు. పార్టీ ఉనికిలో ఉండాలంటే బీజేపీ లాటి పెద్ద పార్టీ అండ అవసరం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పైగా ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఆయనతో పెట్టుకుని రోడ్డు మీదకు రావాలంటే కేంద్రం అండ ఉండి తీరాల్సిందే.మరో వైపు 2019 ఎన్నికల ప్రయోగం విఫలం కావడంతో వామపక్షాల పట్ల పవన్ కళ్యాణ్ వైఖరి కూడా మారిందని అంటున్నారు. కేంద్రంలో బలం ఉన్న బీజేపీతో కలసి ఉంటేనే జనసేనకు కూడా కొత్త బలం వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే తాను బీజేపీతో ఎపుడూ విడిపోలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చూసుకుంటే వామపక్షాలు ఒంటరి అయిపోయాయి. పవన్ కళ్యాణ్ చరిష్మాను నమ్ముకుని ఏపీలో తమ ఉద్యమ బాట నుంచి పక్కకు జరగడంతో కామ్రేడ్స్ ఇపుడు ఎందుకూ కాకుండా పోయారన్న మాట వినిపిస్తోంది.