ప్రతిపక్ష పార్టీల్లో మేధోమధనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతిపక్ష పార్టీల్లో మేధోమధనం

గుంటూరు, డిసెంబర్ 11, (way2newstv.com)
ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు అయింది. కొత్త సర్కార్ పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటుతోంది. చిత్రంగా విపక్ష పార్టీలో ఇంకా మేధోమధనం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. దాని కోసం పార్టీ రధాన్ని సిధ్ధం చేయాల్సిన సారధులు ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోనే ఉండడం విశేషం. ఓవైపు తెలుగుదేశాధీశుడు చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయామో ఇప్పటికీ అర్ధం కావడంలేదు. కానీ ఆయన సమీక్షలు జరుపుతున్నపుడు మాత్రం పలు రకాలైన కారణాలు వల్లె వేస్తున్నారు.ఓసారి ఐక్యంగా నాయకులు లేక ఓడిపోయామని చెప్పిన చంద్రబాబు, మరోసారి ప్రభుత్వం ఎంతో చేసినా కూడా ప్రచారం చేసుకోలేక ఓడామని అన్నారు. 
ప్రతిపక్ష పార్టీల్లో మేధోమధనం

ఇక ఫలితాలు వచ్చేంతవరకూ అయితే మోడీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కు అయి ఓడించారని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రం మోడీ ఊసు ఎత్తడంలేదు. ఇక అదే సమయంలో ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకువచ్చి పెద్ద పీట వేయడం వల్ల కూడా ఓడామని చంద్రబాబు కూడా అంటూ వచ్చారు. సరే ఇవన్నీ నిజాలే. ఇంకా చెప్పాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయని తమ్ముళ్ళు అంటున్నారు.చంద్రబాబు తరువాత పవన్ కల్యాణ్ కూడా ఎందుకు ఓడాం అనుకుంటూ కొన్నాళ్ళుగా జిల్లాలు చుట్టేస్తున్నారు. రాయలసీమ టూర్లో ఆయన మాట్లాడుతూ ఒక ఊళ్లో 150 మంది జనం ఉంటే ఒకరిద్దరు తప్ప అందరూ జనసేన పచ్చబొట్లు వేయించుకున్నారని, కానీ ఓట్లు మాత్రం పది కూడా రాలేదని వాపోయారు. అంటే అక్కడ వైసీపీ రిగ్గింగ్ చేసిందని అర్ధం వచ్చేలా మాట్లాడారు. మరో సందర్భంలో ఈవీఎంల కారణంగానే ఓడిపోయామని అన్నారు. తాను బీజేపీ టీడీపీ కూటమి కట్టలేకపోవడం వల్లా ఓడామని ఇదే పవన్ మరో చోట చెప్పుకున్నారుడబ్బు పంచడం తన సిధ్ధాంతం కాదు కాబట్టి ఓటమి రుచి చూడాల్సివచ్చినని కూడా ఆయనే అన్నారు. నాయకులు సరైన వారు పార్టీలో చేరక ఓడిపోయామని కూడా వింత వ్యాఖ్యలు చేసిన పవన్ తన ఓటమికి ఇపుడు మరో మాట కొత్తగా వినిపించారు. గోదావరి టూర్లో ఆయన ఏకంగా తప్పు అంతా క్యాడర్ మీదనే తోసేశారు. అసలు మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే పార్టీ ఓడిపోయిందని పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో జనసైకులకు గట్టి ఝలక్ తగిలినట్లైంది.అటు చంద్రబాబు, ఇటు పవన్ ఓటమి గురించి తెగ బాధ పడుతూండగానే ఆరు నెలల కాలం ఇట్టే గడచిపోయింది. కాలం ఆగదన్నట్లుగా ముందుకు సాగుతూనే ఉంది. మరో వైపు జగన్ తనదైన రాజకీయం చేసుకుంటూ పోతున్నారు. స్థానిక ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతూంటే టీడీపీ, జనసేన మాత్రం ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోనే ఉన్నారని అంటున్నారు. నిజానికి ఓటమికైనా, గెలుపుకైనా ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిని విశ్లేషించుకోవడంలో తప్పులేదు కానీ చిత్త శుధ్ధి ముఖ్యం. అలాగే ఆత్మ విమర్శ కూడా ముఖ్యం. నా వల్లే పార్టీ ఓడిందని ఏ నాయకుడూ ఇంతవరకూ చెప్పుకోలేదు, అదే సమయంలో నా వల్లే పార్టీ గెలిచిందని మాత్రం అంతా అంటారు. నిజాయతీగా సమీక్ష చేసుకుని రేపటి రోజున ఏం చేయాలన్నది కనుక ప్రణాళిక రూపొందిందించుకుంటేనే ఎవరికైనా గెలుపు పిలుపు వినిపించేది. అంతే తప్ప ఎవరి మీదనో బండ వేసేసి ఓటమి బాధ నుంచి బయటకు రాకపోతే మాత్రం భవిష్యత్తు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సినిమాల్లో ఫ్లాష్ బ్యాకులు బాగుంటాయి. రాజకీయాల్లో మాత్రం ప్రెజెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ మరి.