చెన్నై డిసెంబర్ 26 (way2newstv.com)
ఇక్కడి తమిళనాడు ప్రజలు నచ్చితే తల మీద పెట్టుకొని పూజిస్తారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కాస్త భిన్నంగా ఉంటుంది వీరి వ్యవహరం. అదే సమయంలో తేడా వస్తే పాతాళానికి తొక్కేసేంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తమ సత్తా చాటిన కమలనాథులకు తమిళనాడు ఒక పట్టాన కొరుకుడుపడని పరిస్థితి. బీజేపీని దగ్గరకు రానిచ్చేందుకు సైతం తమిళులు ఇష్టపడరన్న మాటలకు తగ్గట్లే ఎన్నికల సమయంలో వెలువడే ఫలితాలు అదే విషయాన్ని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుంటాయి. మోడీ మాటలకు యావత్ దేశం ఊగిపోతే.. తమిళులు మాత్రం తమ దగ్గర మోడీ పప్పులు ఉడకవన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తమిళుల మనసుల్ని దోచేందుకు ప్రధాని హోదాలో ఉన్న మోడీ పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.
తన పొలంలో మోడీ గుడిని కట్టిన తమిళ రైతు ఒకరు
ఆ మధ్యన చైనా అధినేత మహాబలిపురానికి వస్తే మోడీ తన మాటలతో చేతలతో ఎంతలా హైలెట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతలా శ్రమిస్తున్నా తమిళనాడులో తాను అనుకున్న రీతిలో ఇమేజ్ ను పెంచుకోవటంలో మోడీ వెనుకబడ్డారన్న వాదనకు చెక్ పెట్టే ఉదంతం ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. ప్రధాని మోడీని అమితంగా ఆరాధించే తమిళ రైతు ఒకరు తన పొలంలోనే మోడీ గుడిని కట్టేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఎరకుడిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సహా కేంద్రం తెచ్చిన పలు పథకాలు శంకర్ అనే రైతును విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే.. తన పొలంలో రూ.1.2లక్షల ఖర్చుతో మోడీ గుడిని కట్టిన సదరు రైతు.. నిత్యం పూజలు చేస్తుండటం విశేషం. ఈ గుడిలో దేవుడి ఫోటోలతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోటోలు ఉండటం విశేషం.ఎనిమిది నెలల నుంచి ఈ గుడి నిర్మాణం సాగుతుందని.. గత వారమే దీన్ని తాను స్టార్ట్ చేసినట్లు సదరు రైతు వెల్లడించారు. మోడీ పథకాలే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా తనను విపరీతంగా ఆకట్టుకుందన్న రైతు శంకర్.. ప్రస్తుతం కుంభాభిషేకం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. మహాబలిపురానికి ప్రధాని మోడీ వచ్చిన సమయంలో ఆయన్ను కలుసుకోవాలని ప్రయత్నించినా కుదర్లేదన్నారు. మరి..మోడీకి తెలిస్తే దగ్గరకు పిలిపించి మాట్లాదుతారో లేదో చూడాలి.