విజయవాడ, డిసెంబర్ 14, (way2newstv.com)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు..! ఈ మాటను మరోసారి నిజం చేసేందుకు రెడీ అవుతున్నా రు వంగవీటి రాధాకృష్ణ. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బెజవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఐకాన్‌గా ఉన్న వంగవీటి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ గుర్తింపు పొందారు. ఆదిలో కాంగ్రెస్ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ ఇలా ఒక పార్టీ అంటూ నిలకడ లేకుండా వంగవీటి రాధాకృష్ణ దూకుడు ప్రదర్శించారు. ఒకప్పుడు ఎన్నికష్టాలు వచ్చినా, ఎన్నికల్లోలాలు ఎదురైనా కూడా వంగవీటి రంగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్నారు.
వైసీపీ వైపు... వంగవీటి చూపు
అలాంటి నాయకుడి కుమారుడుగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004లో వైఎస్ ఆశీస్సులతో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత ఇప్పటి వరకు ఆయన ఓటమి పాలవుతున్నారే తప్ప.. గెలిచింది లేదు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే, తనకు సెంట్రల్ నియోజకవర్గం కావాలని పట్టుబట్టి, అది దక్కక పోవడంతో అలిగి టీడీపీకి జై కొట్టారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వంగవీటి రాధాకృష్ణ వ్యవహరించిన తీరు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీలు మారడం అనేది కామనేని అందరూ అనుకున్నారు.అయితే, వంగవీటి రాధాకృష్ణ పార్టీ మార్పుతో పాటు .. జగన్‌ను అధికారంలోకి రాకుండా చేస్తానని ప్రతిజ్ఞలు చేశారు. అదే సమయంలో తన తల్లితో కలిసి ఆయన చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కాలనే కోరికతో యజ్జాలు చేయించారు. ఇది వైసీపీ నేతలకు ఆగ్రహం కల్పించింది. ఇక, టీడీపీ అధికారంలోకి రాలేదు. పోనీ.. వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా గుర్తింపు లభించిందా? అంటే అది కూడా లేదు. బాబు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రామిస్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక టీడీపీకి వచ్చే ఎన్నికల తర్వాత గెలిస్తే తప్పా ఎమ్మెల్సీ వచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఆయన ఎన్నికల తర్వాత మౌనం పాటించారు. ఈ నేపథ్యంలో ఇక టీడీపీలో ఉన్నా.. తనకు గౌరవం లేదని భావించి ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీ వైపు చూస్తున్నారు.తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కమ్ మంత్రి కొడాలి నానిసాయంతో వంగవీటి రాధాకృష్ణ వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి శుక్రవారమే చర్చలు కూడా ప్రారంభమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఎలాగూ విజయవాడలో టీడీపీని ఢీకొట్టాలని భావిస్తున్న వైసీపీ సాధ్యమైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగా అంతో ఇంతో పట్టున్న వంగవీటి రాధాకృష్ణకు మళ్లీతీర్థం ఇవ్వొచ్చని అందరూ భావిస్తున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి