నిరసనలతో అట్టుడుకుతున్న అమరావతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిరసనలతో అట్టుడుకుతున్న అమరావతి

విజయవాడ, డిసెంబర్ 23, (way2newstv.com)
అమరావతి లో రైతుల ఆందోళన చల్లార్చేందుకు వైసీపీ పలు వ్యూహాలు రచిస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగా అమరావతి లో రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్ ల రూపంలోనే వారికి అప్పగిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్ లు ఇతర సౌకర్యాలు కొన్ని చోట్ల చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పరిచింది. వాటిని అలాగే ఉంచి అక్కడ అలాట్ అయిన ప్లాట్ యజమానులకు అప్పగించాలని అయితే అసైన్డ్ ల్యాండ్ ల విషయం లో మాత్రం చట్ట ప్రకారం అసలు యజమానులకు వాటిని అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలు పెట్టారని అంటున్నారు.
నిరసనలతో అట్టుడుకుతున్న అమరావతి

రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రకటించకముందు ఐదు నుంచి పదిలక్షల రూపాయలు పలికే భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. బడా బాబులు అమరావతి ప్రకటనకు ముందే రైతుల అసైన్డ్ భూములు, పట్టా భూములతో సహా దొరికినవి దొరికినట్లు అయినకాడికి కొనుగోలు చేసేశారు. రియల్ ఎస్టేట్ దందా ఎట్లా సాగుతుందో కళ్ళకు కట్టినట్లు సినిమా చూపించారు. వీరికి నాటి ప్రభుత్వంలో పెద్దలు అండగా ఉండటం తో అప్పటి ఆగడాలకు అంతే లేకుండా పోయిందని కొత్త ప్రభుత్వం అధ్యయనంలో బయటపడింది. అసలు బీదా బిక్కి రైతులు మాత్రం ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయారని తేలింది.వెయ్యి, ఎనిమిది వందల గజాల చొప్పున ప్లాట్ లు పొందిన వారు నష్టపోరని వారికి ఎలా చూసుకున్నా వారి పొలం ధరకన్నా నాలుగు రేట్లు అధికంగానే స్థలాల రేట్లు వుంటాయని సర్కార్ లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సర్కార్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి లా మారి వారి భూముల స్థానంలో ఇచ్చే ప్లాట్ లకు ధర తెప్పించాలిసిన బాధ్యత మీద వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ఇప్పటికే పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సైతం భరోసా ఇచ్చారు. అసైన్డ్ భూములు తప్ప మిగిలిన ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్ ల రూపంలో వారికి అప్పగిస్తామని వెల్లడించి రైతులకు కొంత ఉపశమనం కల్పించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరిగే అవకాశాలు వున్నాయి. రాజధాని పై నియమించిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు వేసవి, వర్షాకాల సమావేశాలు విశాఖలో నిర్వహించి శీతాకాల సమావేశాలు మాత్రం అమరావతిలోనే జగన్ ప్రభుత్వం చేపడుతుందని తెలుస్తుంది. అయితే చంద్రబాబు సర్కార్ ఆలోచనకు పూర్తి భిన్నంగా మాత్రం అమరావతి అభివృద్ధి జరగదన్నది తేలిపోయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పరిచి అమరావతిలో ఇచ్చే ప్లాట్ లకు విలువేమి ఉంటుందన్నదే ఆ ప్రాంత రైతుల ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనికి సర్కార్ ఎలా పరిష్కారం వెతికి వీరి సమస్యను పరిష్కరిస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.