జనసేనాని ఫ్యూచర్ ఏమిటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసేనాని ఫ్యూచర్ ఏమిటీ

తిరుపతి, డిసెంబర్ 5, (way2newstv.com)
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతలో బలమైన ఆకర్షణ కలిగిన పవర్ పుల్ గ్లామర్ స్టార్ పవన్ కల్యాణ్. వీరు ఏదైనా మాట్టాడితే దాని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుంది. తమ శక్తిని, ప్రజాకర్షణను సామాజిక అంశాలు, ప్రజల్ని చైతన్యపరిచే దిశలో వినియోగిస్తే ఈ ఇద్దరు యువనేతలకు బ్రహ్మరథం పడతారు. ఇప్పటికే సంఘంలో విచ్ఛిన్న పోకడలకు దారితీస్తున్న కుల,మత పరమైన అంశాలలోకి తీసుకెళితే అందరినాయకుల్లాగే తయారైపోతారు. ఆ తాను ముక్కలుగా మిగిలిపోతారు. రాజకీయాల్లో పైచేయి సాధించడానికి కులాన్ని,మతాన్ని మించిన అస్త్రాలు లేవు. పైకి ఎన్ని చెప్పినా నాయకులు తమలో తాము అందరినీ కలుపుకుని పోవాలనే చూస్తారు. 
జనసేనాని ఫ్యూచర్ ఏమిటీ

కానీ రాజకీయంగా కలిసి వస్తుందనుకుంటే కుల,మత, ప్రాంత పరమైన విషయాలను అడ్వాంటేజ్ గా మలచుకుంటుంటారు. ఇది ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో శాశ్వత సత్యం. అందులోనూ ప్రాంతీయ పార్టీల హవాలో ఇది మరింత హెచ్చుగా కనిపిస్తుంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, జనసేనాని పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, ఒకరినుద్దేశించి మరొకరు చేసుకుంటున్న వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు రాష్ట్రంలో చర్చనీయమవుతున్నాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజలకు వినోదం కలిగిస్తున్నాయి. మీడియాకు రేటింగు అవసరం కాబట్టి అవే విషయాలను పదే పదే చూపించి పబ్బం గడుపుకోవడం అలవాటై పోయింది. నిజానికి ఆయా నాయకులు ఒకసారి చెప్పిన మాటలను వందసార్లు చూపించడమంటే రెచ్చగొట్టడమే. అందుకే అగ్రనాయకులు తమ మాటల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కులం, మతం , ప్రాంతం విషయంలో చేసే వ్యాఖ్యలు అప్పటికప్పుడు సద్దుమణగవు. వాటి పర్యవసానాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. పైపెచ్చు ఈ ఇద్దరు నాయకులకు ఉండే ఆదరణ వాటిని మరింత పెంచి పోషిస్తుంది. ఒకరు అధికారంలో ఉన్న పార్టీకి అధినేత. మరొకరు భవిష్యత్తును ఆశిస్తున్న పార్టీకి అగ్రనేత. ఎంతో బాధ్యతగా మాట్టాడాల్సిన ఈ నాయకులు మాట తూలుతున్నారు. వ్యక్తిగత కుటుంబ విషయాలనూ సంఘంలో చర్చకు పెడుతున్నారు. నేతలు ఏ కులానికి చెందినవారైనా, వారి వ్యక్తిగత జీవితం ఎటువంటి దైనా ప్రజాబాహుళ్యం విశ్వసిస్తేనే అధికారంలోకి రాగలుగుతారు. రాజకీయాల్లో కొనసాగగలుగుతారు.నిజానికి రాజకీయ పార్టీల నాయకులకు కేవలం తమ కులం ఓట్లపైనే ఆధారపడాలని భావించరు. తమ మత విశ్వాసాల ప్రాతిపదికపైనే ఓట్లు తెచ్చుకొంటే చాలనే భావన కూడా ఉండదు. అన్ని కులాలు, మతాలకు చెందిన మెజార్టీ ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికార పగ్గాలు దక్కుతాయి. ఆ విషయం నాయకులకు పక్కాగానే తెలుసు. అయితే ఆయా పార్టీల అధినేతలకు చెందిన కులాల ఆలోచనలు మాత్రం వేరు. అధినేతలను సొంతం చేసుకుంటూ ప్రచారం చేయడం, తమ కులాల ఓట్లు సంబంధిత పార్టీకే పడేలా శ్రద్ధ వహించడం రాజకీయాల్లో సర్వసాధారణ తంతుగానే సాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేనలకు ప్రత్యేకించి కులపరమైన ఓటు బ్యాంకు ఉంది. ఆయా నేతలు దీనిని ప్రోత్సహిస్తున్నారని చెప్పలేం. అలాగని పనిగట్టుకుని ఆ ఓటుబ్యాంకులను తోసిపుచ్చలేరు. తాజాగా పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ల వ్యాఖ్యలు మరింత కులపరమైన విభజనకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ ముగ్గురి భార్యల ప్రస్తావన తేవడం అనుచితం, అసందర్భం. ఫలితంగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిపై తన దాడిని పెంచారు.రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ రంగప్రవేశం చేశారు పవన్ కల్యాణ్. ప్రశ్నించే ధోరణితో పాలిటిక్స్ లో మార్పు తెస్తారనే ఆశలు కూడా రేకెత్తించారు. అధికారం తన అంతిమ లక్ష్యం కాదంటూ ఆయన చేసిన ప్రకటనలు సైతం యువతను ఆకట్టుకున్నాయి. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని వేలెత్తి చూపుతూ జగన్ రెడ్డి అని పదే పదే నొక్కి చెప్పడం ఏ తరహా రాజకీయమో ఎవరికీ అర్థం కాదు. ముఖ్యమంత్రి కులం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. వేరే అంతరార్థంతోనే ఆ ప్రస్తావన తెస్తున్నారని చెప్పకతప్పదు. అదే విధంగా పవన్ కల్యాణ్ కులం గురించి కూడా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయినప్పటికీ పవన్ నాయుడు అంటూ మంత్రులు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తరచూ పేరుకు కొసరు తగిలించడం ఎత్తి పొడుపే. దీని ద్వారా వారు ఆశించిన పలితమేమిటో అంతుచిక్కదు. నిజానికి పవన్ ను వేలెత్తి చూపుతున్నామని భ్రమ పడుతున్నారు, తప్పితే సంబంధిత సామాజిక వర్గం సంఘటితమై అతని వెంట నిలిచేలా పరోక్ష ప్రేరణ కలిపిస్తున్నామన్న తెలివిడి అధికారపార్టీ నేతలకు కొరవడుతోంది. ఏ కారణం చేతనైనా తాజాగా మతాన్ని సైతం జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లు ప్రస్తావనల్లోకి తేవడం దిగజారిపోతున్న రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని పట్టి చూపుతోంది. అత్యంత సున్నితమైన మత విషయాల్లో నేతలు, అందులోనూ అగ్రనేతలు సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. వారి మధ్య ఉన్న వ్యక్తిగత వైరాలు, విభేదాలు, రాజకీయ వైషమ్యాలను సంఘానికి చుట్టబెట్టకుండా ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి.