అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్
అమరావతి డిసెంబర్ 31 (way2newstv.com)
రాజధాని రైతులకు అండగా ధర్నాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. యర్రబాలెం గ్రామంలో రైతులను అయన కలిసి మాట్లాడారు. మా భూములు ఇచ్చి... నేడు రోడ్డెక్కాం. మాకు న్యాయం చేయాలని కోరితే అవహేళన చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ అమాత్యులే రైతులను అవమానిస్తున్నారని అక్కడి మహిళలు పవన్ తో అన్నారు. ఆనాడు అమరావతి రాజధాని అని జగన్ కూడా చెప్పారు. ఇప్పుడు స్మశానం, ఎడారి అని వైసిపి మంత్రులు మాట్లాడుతున్నారు. జగన్ మా అందరినీ మోసం చేశారు. ఈ రోజు మా పిల్లలతో కలిసి రోడ్డు న కూర్చుంటున్నాం. అమరావతి ఇక్కడి నుంచి మారిస్తే.. మాకు ఆత్మహత్య లే దారి. ఇప్పుడు పనులు, ఉద్యోగాలు కోసం మళ్లీ వలసలు పోవాల్సిన పరిస్థితి. మా ఫ్లాట్లు మాకు ఇస్తామని ఇప్పుడు అంటున్నారు.
పోరాటం అపవద్దు
రోడ్లు వేసి, బిల్డింగ్ లు కట్టి.. స్థలాల్లో ఇప్పుడు వ్యవసాయం చేసుకోమంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భూములు ఇచ్చాం. మా భవిష్యత్తే నేడు వీధిన పడింది. మేము ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లు అడ్రస్ లేకుండా పోయారు. మీరు మా పక్షాన పోరాడి.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు.పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జాతీయ సమగ్రతకు భంగం కలగకుండా ఉండాలనేదే జనసేన సిద్దాంతం. చక్కటి రాజధాని కావాలని ఆనాడు అందరూ భావించారు. ఐదు కోట్ల మంది ప్రజల పాలనా రాజధానిగా అమరావతి ని నిర్ణయించారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించలేము. కొన్ని దశాబ్దాల పాటు అభివృద్ధి కొనసాగాలని అన్నారు. 33వేల ఎకరాలు భూసమీకరణ అంటే నేను భయపడ్డాను. ఆనాడు చంద్రబాబు, జగన్ అందరూ అమరావతి ని రాజధానిగా అంగీకరించారు. ప్రజలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వమే రైతులను మోసం చేసింది. మీరంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదు. నిన్న మా పార్టీ నేతలు కూడా ఏకాభిప్రాయం తో ఒకే రాజధాని అని చెప్పారు. నేను మీకు అండగా ఉంటాను... నా వంతు పోరాటం చేస్తా. మీరు మాత్రం ఈ పోరాటాన్ని ఆపవద్దని అన్నారు.