పరాకాష్టకు చేరుకుంటున్న వ్యక్తిగత విమర్శలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరాకాష్టకు చేరుకుంటున్న వ్యక్తిగత విమర్శలు

విజయవాడ, డిసెంబర్ 10, (way2newstv.com):
ప్రయివేట్ గా ఉన్నంత కాలం ఎవరి బతుకులు వారివి. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలే ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. ఏ నాయకుడు అతీతం కాదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల వ్యక్తిగత జీవితాలే ప్రధాన అంశాలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వంటివారు ఇటీవల తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న తీరు వీరంతా ఎటు పోతున్నారనే ప్రశ్ననే లేవనెత్తుతుంది.
పరాకాష్టకు చేరుకుంటున్న వ్యక్తిగత విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అండ్ టీం జగన్ పైనా ఆయన పార్టీపైనా చట్టసభలోను బయట పదేపదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దాడికి దిగేవారు. జగన్ కి భయపడే ఆయన తండ్రి బెంగళూరు లో వ్యాపారం నిమిత్తం పెట్టారని వారి తాత, తండ్రి ఫ్యాక్షనిస్టులని, ప్రజాధనం లూఠీ చేసిన దొంగ అంటూ దుమ్మెత్తిపోసేవారు. ఇక వైఎస్ జగన్ సైతం చంద్రబాబు లోకేష్ లపై పదేపదే వ్యక్తిగత విమర్శలకు దిగడం పరాకాష్టగా మారడం అంతా చూసిందే. గత ఎన్నికల ముందు నుంచి వీరిమధ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా జగన్ జైలు, కోర్టు పక్షి అంటూ దొంగ, ప్రజాధనం దోచిన దొంగ అంటూ పదేపదే దాడి చేసేవారు. ఇక ఆయన వైఖరి చూసి చూసి విసిగిన వైఎస్ జగన్ ఎన్నికల ముందు పవన్ నిత్యపెళ్లికొడుకు అంటూ ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి సంచలనం సృష్ట్టించారు. అలా మొదలైన వార్ ఇంకా కొనసాగుతూనే వుంది.తాజాగా అసెంబ్లీలో మహిళలపై అత్యాచారాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్ ఒక పక్క చంద్రబాబు ప్రసంగాన్ని తూర్పారబడుతూ పనిలో పనిగా జనసేన అధినేత పై పరోక్షం గా పడ్డారు. తనకు ముగ్గురు నలుగురు భార్యలు లేరని వ్యాఖ్యానించారు జగన్. నాకు ఒక్కరే భార్య అంటూ రెండు సార్లు చెప్పడం ద్వారా ఇటీవల తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తన బాబాయి హత్య కేసును ప్రస్తావిస్తున్న పవన్ దూకుడుకు చెక్ పెట్టాలన్న ధోరణి ముఖ్యమంత్రి జగన్ లో కనిపించింది. ఇలా వ్యక్తిగత జీవితాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ నేతలంతా దెప్పిపొడుచుకుంటున్న తీరు ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు సరికదా భవిష్యత్తులో మరింతగా ఒకరిపై మరొకరు విరుచుకుపడేలాగే వుంది. ఈ ధోరణి ఎప్పటికి మారుతుందన్నది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేమంటున్నారు.