రైల్వే స్టేషన్లలలో బాటిల్ క్రషింగ్ మెషిన్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైల్వే స్టేషన్లలలో బాటిల్ క్రషింగ్ మెషిన్స్

వరంగల్, డిసెంబర్ 12, (way2newstv.com)
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది. ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్‌ క్రషింగ్‌ మిషన్‌’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి.రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. 
 రైల్వే స్టేషన్లలలో బాటిల్ క్రషింగ్ మెషిన్స్

పూణే రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్‌ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు.నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ను ఇందులో వేస్తే బాటిల్‌ చూరచూర అవుతుంది. తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పులు, గ్లాస్‌లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్‌ ముక్కలుగా మారుతోంది. ఆ ముక్కలను ప్లాస్టిక్‌ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్‌ ద్వారా ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్క్రీన్‌పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ప్లాస్టిక్‌ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్‌ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్‌ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్‌తో దేశ భవిష్యత్‌కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్‌ భాషలో వివరిస్తుంటారు.