కడప, డిసెంబర్ 19, (way2newstv.com)
ఖచ్చితంగా ఏడాది కిందట కడప జిల్లాపై అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు భారీ ఆశలే పెట్టుకున్నా రు. జిల్లాలో వైసీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అనేక వ్యూహాత్మక కార్యక్రమాలకు ఆయన నాంది పలికారు. ఆదినారాయణరెడ్డి లాంటి కీలక నాయకులను తన పార్టీలో చేర్చుకున్నారు. కోరినన్ని నిధులు ఇచ్చారు. అడిగిన ప్రాజెక్టులను ఇచ్చారు. పులివెందులకు పట్టిసీమ ద్వారా నీరు సరఫరా చేశారు. నాయకులతో రోజూ మాట్లాడారు. ఏకతాటిపై నడిపించారు. జగన్ ను భారీ దెబ్బ కొట్టాలనే వ్యూహంతో రాజకీయంగా అడుగులు వేశారు. అయితే, ఎన్నికల నాటికి అవన్నీ వికటించాయి. అనూహ్యంగా కడప మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.అదే సమయంలో టీడీపీకి బలమైన నాయకులుగా ఉన్న సీఎం రమేష్ సహా ఆదినారాయణ రెడ్డి వంటి పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కడపలో చెల్లాచదరవుతున్న టీడీపీ కేడర్
దీంతో జిల్లాలో పార్టీకి అక్కడ సమర్ధవంతులైన నాయకులు ఇప్పుడు కరువయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి పార్టీకి జనాకర్షణ ఉన్న నేత కాలేకపోయారు. ఇక జగన్ మీద పదే పదే పోటీ చేస్తున్న పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఇటీవల కాలంలో నోరు కూడా విప్పడం లేదు. పన్నెత్తు మాట కూడా అనడం లేదు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ రివ్యూ తర్వాత ఆయన పుంజుకుంటారని అనుకున్నా.. ఆశించిన రేంజ్‌లో ఆయన ఎక్కడా పుంజుకోలేక పోయారు. పైగా ఆయన ఈ నెల మూడో వారంలో పార్టీ మారతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.మరోపక్క, జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు జిల్లాకు కోట్లకు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు. అదే సమయంలో స్టీల్ కంపెనీ ఏర్పాటుకు త్వరలోనే భూమి పూజ చేయడంతోపాటు భూమి కూడా కేటాయించారు. నిధులు కూడా ఇచ్చారు. పులివెందుల సహా కడప జిల్లాలోని కీలకమైన ప్రాంతాలకు సాగునీటిని అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ హవా మరింత గా పెరిగింది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సారధ్యంలో ప్రతిపనినీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా నిర్దిష్టంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.జిల్లాలో కడప, రాజంపేట ఎంపీలతో సహా ఎమ్మెల్యేలు అందరూ వరుసగా రెండోసారి గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ కేడర్ రోజు రోజుకు మరింత స్ట్రాంగ్ అవుతుంటే.. టీడీపీ కేడర్ బేజారవుతోంది. దీంతో టీడీపీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. మరోపక్క, బీటెక్ రవి వంటి వారు ఉన్నా.. మౌనంగానే ఉంటున్నారు. ఏదో శాసన మండలిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తమ పని తాము చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇటీవల కేసుల నేపథ్యంలో ఆయనపై ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఆయన కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారంటున్నారు. దీంతో అసలు కడపలో టీడీపీ మరింత దిగజారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Tags:
Andrapradeshnews