పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఏపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఏపీ

విజయవాడ, డిసెంబర్ 6, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ సంసారం గుట్టుగా ఏమీ సాగడంలేదు. అంతా రట్టుగానే ఉంది. ఆ మాటకు వస్తే బట్టబయలు కూడా ఎపుడో అయిపోయింది. ఏడవకపోతే ఏ చిన్న పనీ జరగడంలేదు, ఏడిస్తే పరువు దక్కడంలేదు అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితి ఉంది. ఏపీ ఖజానా ఖాళీ అన్న విషయం రాజకీయాల మీద అవగాహన ఉన్న వారందరికీ ఎరుకే. మరి బండి ఎలా లాగిస్తున్నారు అంటే అప్పు చేసి పప్పుకూడు అన్నది కూడా ఎరుకే. అందుకే 90 వేల కోట్ల అప్పుతో ఏపీ విభజన జరిగితే అయిదేళ్ల టీడీపీ జమానా ముగిసేనాటికి మూడున్నర కోట్లకు ఆ అప్పు ఎగబాకింది. అంటే టీడీపీ సర్కార్ అక్షరాల రెండున్నర లక్షలకు పైగా అప్పులు చేసిందని వైసీపీ మంత్రులు చెబుతున్నారు.
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఏపీ

ఇక జగన్ సర్కార్ ఆరు నెలల పాలనలో కూడా ప్రతీ రోజూ అప్పులు చేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రులే చెబుతున్నారు. ఎందుకంటే నిన్నటి దాకా ఖజానా జమా పద్దులను లెక్కబెట్టిన అనుభవంతో వారు చెబుతున్న మాటలు ఇవి. ఒక్క ఆగస్ట్ నెలలోనే అయిదు సార్లు ఎందుకు అప్పు తెచ్చారు జగన్ సారూ అంటూ మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడుగద్దిస్తున్నారు. నిజానికి ఆయన అయిదేళ్ళ ఆర్ధిక మంత్రిత్వంలో కూడా ఏపీ అప్పుల కుప్పేనన్నది మరిచి విమర్శలకు దిగుతున్నారు. జీతాలకు ప్రతీ నెలా తడుముకుంటున్నారని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకూ నిజమో కానీ వైసీపీ వచ్చిన తొలి నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు లేట్ అయ్యాయని ప్రచారంలో ఉంది. ఇక నిధుల కొరత పట్టిపీడిస్తోందని కూడా అంటున్నారు. రెవిన్యూ తగ్గింది. కీలకమైన ఎక్సైజ్ శాఖ నుంచి రావాల్సిన ఆదాయాన్ని మధ్య నిషేధం పేరిట తగ్గించుకున్నారు. వాణిజ్య పన్నుల ఆదాయం తగ్గింది. నిర్మాణ రంగం ఇసుక కొరతతో కుదేలయింది. ఇలా ఆదాయం గడచిన ఆరు నెలల్లోనే తగ్గిందన్న నివేదికలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో ప్రతీ నెలా అప్పులు చేసి జగన్ సర్కార్ బండిని ప్రభుత్వం నడుపుతోంది. ఖజానా ఖాళీగా పెట్టుకుని జగన్ నవరత్నాల పేరిట హామీలు ఇస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కిలోమీటర్ కూడా కొత్తగారోడ్డు వేయలేదని, ఎక్కడా నిర్మాణాలు లేవని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కేవలం మాటలతోనే సర్కార్ కాలక్షేపం చేస్తోందని, సంపదను స్రుష్టించడం మానేసి అభివ్రుధ్ధిని పక్కన పెట్టేసి వైసీపీ నేతలు దౌర్జన్యాల పాలన చేస్తున్నారని ఆయన అంటున్నారు. తక్షణం ఏపీ ఆర్ధిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.ఇవన్నీ సరే కానీ నిన్నటి వరకూ ఏపీని నడిపిన మంత్రులకు ఆర్ధిక స్థితి ఏంటన్నది తెలియదు అనుకోగలమా? ఇపుడు కొత్తగా అరునెలల్లో జగన్ ఆస్తులనూ పెంచలేకపోవచ్చు, అప్పులనూ లక్షల కోట్లలో చేయకపోవచ్చు. ఇదంతా గత ప్రభుత్వ వారసత్వమే, తమ నిర్వాకమే అని తెలిసి కూడా తమ్ముళ్ళు దివాళా కోరు డిమాండ్లు చెస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ రాజకీయ విమర్శలు పక్కన పెడితే జగన్ నవరత్నాల హామీలకే 90 వేల కోట్లు అచ్చంగా ఏటా ఖర్చు అవుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మరో వైపు ఉద్యోగుల జీతాలు, సాధారణ పాలన సాగాలన్న కూడా రెండు లక్షల కోట్ల రూపాయలు ఏటా బడ్జెట్లో అవసరం. మరి ఏపీలో నిధుల కొరత చాలా ఉంది. కేంద్రం ఏ రకమైన సాయమూ చేయదు. ఈ నేపధ్యంలో ఎలా ఏపీ బండిని ముందుకు తీసుకుపోతారన్నది తలపండిన ఆర్ధికవేత్తలకు కూడా ఆందోళన కలిగించే విషయమేనని అంటున్నారు.