యదేఛ్చగా ఇసుక తవ్వకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చగా ఇసుక తవ్వకాలు

రాజమండ్రి, డిసెంబర్ 18 (way2newstv.com)
పూడికతీత ముసుగులో గోదావరి నదిలో పెద్దఎత్తున అక్రమాలకు తెరతీశారు. నదిపై వంతెనలకు సమీపంలో ప్రమాదభరితంగా పొక్లయినర్లతో ఇసుకను తవ్వేస్తున్నారు. 20-30 మీటర్ల లోతున ఇసుక తవ్వేస్తూ నదీ గర్భంలో అగాధాలను సృష్టిస్తున్నారు. నిబంధనలకు పాతర వేసి, నదికి తూట్లు పొడిచే ప్రక్రియ రాజకీయ పలుకుబడితో సాగిపోతోందని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అఖండ గోదావరి నది ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి ఎగువన రాజమహేంద్రవరం మండలం కాతేరు గ్రామం వద్ద ఎడమ గట్టును ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా పొక్లైన్లతో ఇసుకను యధేచ్ఛగా తవ్వేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా ఈ ప్రాంతంలో పొక్లయిన్లతో ఇసుకను తవ్వుతున్నట్టు స్థానిక రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రెండు రోజుల క్రితం సబ్-కలెక్టర్ వచ్చి పరిశీలించారు. 
యదేఛ్చగా ఇసుక తవ్వకాలు

అయినా మళ్ళీ యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రాంతంలో పొక్లయిన్లతో చాగల్నాడు పంపింగ్ స్కీము వద్ద భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఏపీఎండీసీ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ ఆ ప్రాంతంలో ఎవరూ కన్పించకుండా జాగ్రత్త పడుతూ ఇసుక తవ్వకాలు పొక్లయిన్లతో తవ్వేస్తున్నారు. చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి వాస్తవానికి రబీ సీజన్‌లో నీటి విడుదలకు అనుమతి లేదు. కానీ మంచినీటి అవసరాల నిమిత్తం చెరువులను నింపుకోవడానికి చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపును ఆన్‌చేసి 165 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నీటిని విడుదల చేసేందుకు చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నదీ గర్భంలో గట్టుకు లోపలి భాగంలో వుండే ఇన్‌టేక్‌వెల్‌కు అడ్డుగావున్న ఇసుక మేటలను తొలగించే పేరుతో పూడికతీత పనులు చేపట్టి ఆ పనుల ముసుగులో పొక్లయిన్లతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఏపి మైనింగ్ శాఖ జాబితాలో కాతేరు గ్రామంలో డీసిల్టేషన్ ర్యాంపు ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారు. ఈ మేరకు డీ సిల్టేషన్ ర్యాంపులో యంత్రాలతో పనులు చేయించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ డీసిల్టేషన్ ర్యాంపులో రాజకీయ పలుకుబడితో పొక్లయిన్లతో విచ్చల విడిగా ఇసుకను రోజు వందలాది లారీల చొప్పున భారీ టిప్పర్లతో తరలిస్తున్నారు. వాహనాలకు జీపీఎస్‌లు లేకుండా, ఎక్కడికి పోతోందో కూడా తెలియని విధంగా పర్యవేక్షణ కూడా లేకుండా ఈ ఇక్కడ నుంచి నిత్యం పగలూ రాత్రీ తేడా లేకుండా భారీ టిప్పర్లు ఇసుక రవాణా చేస్తున్నాయి. పంటలకు నీరు అవసరం లేకపోయినా ఎత్తిపోతల పథకాన్ని ఆన్‌చేసి నీటిని వినియోగిస్తూ, ఇసుక తరలించడానికి వీలుగా పూడికతీత పనులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగం ఇక్కడ గూడు పుఠాణీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం వందలాది లారీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక ఇరిగేషన్ జేఈని ప్రశ్నించగా నాలుగైదు రోజుల నుంచే చాగల్నాడు పంపింగ్ స్కీమ్ నుంచి మంచినీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఇసుకతీతకు తమకు ఎటువంటి సంబంధం లేదని, పూర్తిగా ఏపీఎండిసీ పర్యవేక్షణలోనే జరుగుతోందని సమాధానం చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ రూ. కోట్ల విలువైన ఇసుకను దాదాపు రెండు నెలలుగా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఈ వ్యవహారంలో ఎవరెవరు వున్నారో తేలుతుందని స్థానికులు అంటున్నారు. ఇదిలా వుండగా అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు ఏపీ మైనింగ్ శాఖ కేతావారిలంక డీసిల్టేషన్ గాయత్రి ర్యాంపులో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు 2020 సెప్టెంబర్ వరకు అనుతి వుంది. ఏపీ ఎండిసీ పర్యవేక్షణలో ఇసుక తీసి విక్రయిస్తున్నారు. బ్రిడ్జిలంక కోటిలింగాల ర్యాంపులో 2 లక్షల క్యూబిక్ మీటర్లు, వెంకటనగరం డీ సిల్టేషన్ ర్యాంపులో 2 లక్షల క్యూబిక్ మీటర్లు, వెంకటనగరం డీ సిల్టేషన్ కాతేరు గ్రామం వద్ద చాగల్నాడు ఎత్తిపోతల పధకం వద్ద కేవలం 30వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను 2020 అక్టోబర్ 28వ తేదీ వరకు తీసేందుకు అనుమతి వుంది. కానీ ఇక్కడ దాదాపు రెండు నెలల నుంచి యంత్రాలను వినియోగించి ఇసుక తీస్తున్నారంటే లక్షలాది క్యూబిక్ మీటర్లు తీసినట్టేనని, కానీ అధికారుల లెక్కల్లో మాత్రం కేవలం 30వేల క్యూబిక్ మీటర్లకే అనుమతి వుంది. సీతానగరం మండలం కాటవరంలో డీ సిల్టేషన్ ర్యాంపులో 1.62 వేల క్యూబిక్ మీటర్లకు, కాటవరం ములకల్లంక డీసిల్టేషన్ ర్యాంపులో 1,05,294 క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు అనుమతి వుంది. నిర్ధేశిత డీసిల్టేషన్ ర్యాంపుల్లో నిర్ణయించిన లోతును మించి ఇసుక తొలగించినా పర్యవేక్షించే యంత్రాంగం లేదని తెలుస్తోంది.