ఉగాది నాటికి రాజధాని మార్చేందుకు అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉగాది నాటికి రాజధాని మార్చేందుకు అడుగులు

విజయవాడ, డిసెంబర్ 26, (way2newstv,com)
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో మకాం మార్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఓ వైపు దానికి అనుగుణంగా కమిటీ నివేదికలు కూడా వచ్చిన నేపధ్యంలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెట్టే బేడా సర్దేస్తున్నారు. కొత్త ఏడాదిలో తెలుగు సంవత్సరాదికి విశాఖలో కాపురం పెట్టేయలన్నది జగన్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఉగాదికి పరిపాలనా రాజధాని అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మొత్తం విశాఖలో జగన్ సన్నిహిత ఎంపీ విజయసాయిరెడ్డి చక్కబెడుతున్నారని అంటున్నారు.జగన్ సచివాలయాన్ని విశాఖకు తరలించడానికి అవసరమైన ప్రభుత్వ భవనాలు చాలానే ఉన్నాయి. 
ఉగాది నాటికి రాజధాని మార్చేందుకు అడుగులు

అందులో విశాఖ మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటీ బహుళ‌ అంతస్థుల భవనం ఒకటి ఉంది. దాన్ని సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది విశాఖ నగరం నడిబొడ్డున ఉంది. పదికి పైగా అంతస్తులతో అలరారుతున్నా ఈ భవనం కనుక సచివాలయం కోసం తీసుకుంటే కచ్చితంగా సరిపోతుంది. పైగా కొత్త లుక్ కూడా వస్తుందని అంటున్నారు. అన్నింటికీ అందుబాటులో ఈ బిల్డింగ్ ఉందని కూడా చెబుతున్నారు.ఇక బీచ్ రోడ్డులో సీ వ్యూ పాయింటులో కనుక సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ కూడా ప్రభుత్వం భవనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రుషికొండ వద్ద మిలీనియం టవర్స్ కూడా సెక్రెటేరియట్ పెట్టేందుకు అనువుగా ఉందని అంటున్నారు. ఇది కూడా పది అంతస్థుల భవనం కావడం విశేషం. దీంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడ ఖాళీ భవానాల్లో సరిపోతుందని అంచనాకు వస్తున్నారుమరో వైపు భీమిలీ సాగర తీరంలో ఐటీ భవనాలూ అధునాతన డిజైన్లతో ఉన్నాయి. ఇవి సైతం సచివాలయ నిర్వహణకు పనికివస్తాయని అంటున్నారు. వీటిని ఉపయోగించుకోవాలని కూడా వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇక సబ్బవరంలోనూ ప్రభుత్వ భవనాలు, స్థలాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికిపుడు అమరావతి నుంచి షిఫ్ట్ కావాలంటే విశాఖలో పూర్తి అవసరాలకు పనికి వచ్చే సర్కార్ బిల్డింగులు ఎక్కువగానే ఉన్నాయని ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో వెల్లడైంది.ఇక జగన్ ఉగాది రోజు అంటే మార్చి 25 నాటికి విశాఖకు సచివాలయంతో పాటు, మొత్తం తన కార్యకలాపాల‌ను షిఫ్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తొలి ఏడాది సీఎంగా పూర్తి కావడానికి ముందే పాలనను విశాఖకు రప్పించడం ద్వారా తనదైన రాజధానిలో ఉండాలనుకుంటున్నారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఏపీ సర్కార్ తొలి వార్షిక బడ్జెట్ సమావేశాలు కూడా విశాఖలోనే జరుగుతాయని అంటున్నారు. మొత్తానికి ముహూర్తం కుదిరింది. డేట్ కూడా ఫిక్స్ అయిందని వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట.