ఆర్టీసీ బాదుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీసీ బాదుడు

భారీగా పెరిగిన చార్జీలు
హైద్రాబాద్, డిసెంబర్ 2, (way2newstv.com)
ఆర్టీసీలో పెంచిన ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి. 52 రోజుల సుదీర్ఘ సమ్మె అనంతరం కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్టీసీ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే.. పెంచింది తక్కువే అయినా.. చిల్లర తిప్పలు లేకుండా అడ్జస్ట్‌మెంట్ల పేరుతో ప్రయాణికులకు చివరికి బాదుడు తప్పట్లేదు. బస్ పాసులపైనా బాదుడు తప్పలేదు.పల్లె వెలుగు సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 చేశారు. నాలుగైదు స్టాపులకు రూ.5 చొప్పున పెంచుతూ పోయారు. అటు సిటీ బస్సుల్లోనూ కనీస ఛార్జీ రూ.5 నుంచి రూ.10కి పెరగడం గమనార్హం. 
ఆర్టీసీ బాదుడు

ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్ తదితర బస్సు సర్వీసుల్లో ఈ పెంపు మరింత అధికంగా ఉంది.పల్లె వెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ ఇకపై రూ.10కి పెరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.15కు పెరిగింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న అన్ని టికెట్లపై రూ.5 చొప్పున పెంచుకుంటూ పోయారు.ఇక డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సుల్లో టికెట్ కనీస ఛార్జీల ధర వరసగా రూ.20, రూ.25గా ఉండనున్నాయి. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.35కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ ఏకంగా రూ.70కి పెరిగింది.సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.5 నుంచి రూ.10లకు పెంచారు. మెట్రో డీలక్స్ సర్వీసుల్లో కనీస ఛార్జీ రూ.10 నుంచి 15కు పెంచారు. టికెట్ ఛార్జీలన్నీ ప్రస్తుతం ఉన్న వాటిపై రూ.5 చొప్పున పెంచుకుంటూ పోయారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రావెల్ యాజ్ యూ లైక్ (నాన్ ఏసీ సర్వీసులు) టికెట్‌ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న రూ.80 నుంచి రూ.100కు పెంచారు.జనరల్, స్టూడెంట్ నెలవారీ పాసులపైనా ఛార్జీల పెంపు తప్పలేదు. జనరల్ పాసుల్లో.. ఆర్డీనరీ మంత్లీ పాసులపై వసూలు చేస్తున్న మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.770 నుంచి రూ.950కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాసులను రూ.880 నుంచి రూ.1070కు పెంచారు. ఇక మెట్రో డీలక్స్ పాసుల ఛార్జీలను రూ.990 నుంచి 1185కి పెంచారు. ఎంఎంటీఎస్-ఆర్టీసీ కాంబినేషన్ మంత్లీ పాసులపై వసూలు చేసే మొత్తాన్ని రూ.880 నుంచి రూ.1090కి పెంచారు. ఇక విద్యార్థుల క్వార్టర్లీ బస్ పాసులపై రూ.150 వరకు పెరిగింది.20 పైసలు పెంచినా.. అదే లెక్క ప్రకారం వసూలు చేస్తే చిల్లరకు ఇబ్బందులు తప్పవు. అందువల్ల వీటిని రౌండప్ చేశారు. ఇందులో భాగంగా కనీసం ఛార్జీలను రూ.5 నుంచి రూ.10 వరకు.. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అయితే రూ.10 నుంచి రూ.15కు పెంచారు. ఇదే లెక్కన ప్రతి 4 స్టాపులకు రూ.5 చొప్పున పెంచుకుంటూ పోయారు. చిల్లర సమస్య రాకుండా ఇలా చేస్తున్నా.. ప్రయాణికులపై మాత్రం మోత తప్పదన్నమాట.ఆర్టీసీలో పెంచిన ఛార్జీలను వాస్తవానికి సోమవారం నుంచే అమల్లోకి తీసుకురావాలని భావించారు. కానీ, టికెట్ రేట్ల ఖరారు, టికెట్ మిషన్లలో వాటి అప్‌డేట్ లాంటి ప్రక్రియలు ఉండటంతో ఒక రోజు వాయిదా వేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
డిసెంబర్ 2 అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిపోల నుంచి బయలుదేరే బస్సుల్లో ఈ కొత్త ఛార్జీల ప్రకారం ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మొత్తంమీద ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులపై ఛార్జీల భారం పడింది.