విజయవాడ, డిసెంబర్ 5, (way2newstv.com)
కృష్ణాజిల్లా టీడీపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందా? కీలకమైన నాయకులు ఇప్పటికే పార్టీ దూరం కాగా.. మరింత మందిని దూరం చేసేలా దిగువ శ్రేణి నాయకులు చక్రం తిప్పుతున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. ఇక, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా తట్టా బుట్టా సర్దు కుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తీవ్ర అసంతృప్తితో కాలం గడుపు తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో పార్టీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో బతికి బట్టకట్టడం అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.
పామర్రుకు వర్ల
ఇదిలావుంటే, ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గానికి రిజర్వ్ అయిన ఈ నియోజక వర్గంలో టీడీపీ స్తబ్దుగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి జవహర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఆయన ఇక్కడ ఉన్నా.. మనసు మాత్రం 2014లో ఆయన విజయం సాధించిన కొవ్వురు పైనే ఉంది. దీంతో ఆయన ఇక్కడ తనకు టికెట్ వద్దని అనుమతిస్తే.. కొవ్వూరు వెళ్లిపోతానని చెబుతున్నారు.జవహర్ ఇప్పటికే ఈ విషయాన్ని బాబుకు చెప్పేశారు. కానీ ఈ విషయం ఇంకా తేలలేదు. ఇదిలావుంటే.. ఇప్పడు పార్టీలో అధికార ప్రతినిధి, మాజీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గడిచిన నెల రోజులుగా ఇక్కడి పార్టీ కార్యక్రమాలను అనధికారికంగా సమీక్షిస్తున్నారు. వాస్తవానికి 20009 ఎన్నికల్లోనే వర్ల రామయ్య నందిగామ సీటు ఆశించగా అప్పట్లో ఆయన ఎక్కడ డామినేట్ చేస్తారో ? అని దేవినేని ఉమా నందిగామ సీటు రాకుండా అడ్డుపడ్డారు. ఇక 2014 ఎన్నికల్లో పామర్రు నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది ఆయనకు టికెట్ ఇవ్వలేదు.ఇక ఇప్పుడు పామర్రులో ఎలాగూ టీడీపీ నాయకులు ఉప్పులేటి కల్పన ఉండడంతో ఆయన తిరువూరు వైపు చూస్తున్నారు. నిజానికి తిరువూరులో పార్టీని బలోపేతం చేసిన నల్లగట్ల స్వామిదాసు ఉన్నా.. ఈ ఏడాది ఎన్నికల్లో ఆయనను పక్కన పెట్టారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వరుసగా ఆయన మూడు సార్లు ఓడిపోవడంతో పార్టీ పక్కన పెట్టింది. దీంతో ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు. పైగా వైసీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, బాబు మాత్రం ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇంతలోనే వర్ల ఇక్కడ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు ఎలా మారతాయో ? చూడాలి. ఇక జవహర్ తిరువూరును వదిలించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో వర్ల ఇక్కడ పాగా వేసేందుకు అంతే జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.