మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది: ప్రియాంక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది: ప్రియాంక

న్యూఢిల్లీ డిసెంబర్ 14  (way2newstv.com)  
 కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దేశాన్ని అమితంగా ప్రేమిచే ప్రజలంతా కలిసికట్టుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో శనివారంనాడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'భారత్ బచావో' ర్యాలీలో మోదీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు.'ప్రతి బస్‌స్టాప్‌లోనూ, వార్తాపత్రికల్లోనూ మోదీతోనే ఏదైనా సాధ్యమని ప్రచారం చేసుకుంటున్నారు. నిజమే....బీజేపీతోనే ఉల్లిగడ్డ రూ.100కు చేరుకోవడం సాధ్యం. 
మోదీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది: ప్రియాంక

దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేని నిరుద్యోగం బీజేపీ హయాంలోనే సాధ్యం. నాలుగు కోట్ల ఉద్యోగాలు పోవడమూ బీజేపీతోనే సాధ్యం' అని ప్రియాంక పదునైన చురకలు వేశారు. అహింస, సోదరభావం, ప్రేమకు పెట్టింది పేరు భారతదేశమని, అలాంటి ఈ దేశాన్ని మనమంతా కాపాడుకోవాలని ర్యాలీకి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రియాంక అన్నారు.ఆరునెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ రెక్కలు విరిచారని, ఇప్పటికీ మంత్రులకు పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్ధం కావడం లేదన్నారు. అంతా బాగుందని, ప్రపంచంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నామని ఆర్థిక మంత్రి నమ్మబలుకుతున్నారని, నిజానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో సదరు మంత్రి కూడా చెప్పలేకపోతున్నారని ప్రియాంక విమర్శించారు. ప్రజలకు తాను ఒకటే చెప్పదలచుకున్నానని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్క పౌరుడు తమ వాణిని బలంగా వినిపించాలని, అలా చేయని పక్షంలో భయం గుప్పిట్లో మగ్గిపోవాలని, మౌనంగా భరిస్తూ పోతే భారత రాజ్యాంగ విధ్వంసం కూడా తప్పదని ప్రియాంక హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖ నేతలు  ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యకర్తలు, పెద్దఎత్తున ప్రజానీకం తరలివచ్చారు.