అనంతపురం, డిసెంబర్ 3,(way2newstv.com)
అనంతపురం జిల్లాలో టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గం హిందూపురం. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన జగన్ సునామీ టీడీపీని తుడిచి పెట్టేసినా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ సత్తా చాటలేకపోయింది. అలాంటి కీలక నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. అయితే, ఈ నియోజకవర్గంపై జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఫెయిలయ్యాయనే వాదన వినిపిస్తోంది. 2014లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య వరుసగా రెండోసారి గెలుపు గుర్రం ఎక్కారు. ఈయనపై ఓడిపోయిన వైసీపీ నాయకుడు బీ.నవీన్ నిశ్చల్‌కు ఈ ఏడాది టికెట్ ఇవ్వలేదు.కానీ, స్థానిక రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో వైసీపీని నడిపించడంలో నవీన్ బాగానే కృషి చేశారు. దీంతో ఆయన టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు.
హిందూపురంపై జగన్ గురి
కానీ, ఆయనకు టికెట్ ఇవ్వకుండా మహమ్మద్ ఇక్బాల్‌కు ఇవ్వడంతో మళ్లీ బాలయ్య గెలుపునకు వైసీపీ అవకాశం ఇచ్చినట్టయింది. ఇదిలావుంటే, ఇక్బాల్ ఓటమి తర్వాత.. ఆయనకు జగన్ నుంచి అనూహ్యమైన పదవి లభించింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు మాసాల్లోనే ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి వరించింది. దీంతో ఆయన అమరావతి, తాడేపల్లి.. తదితర నగరాల్లోనే బిజీగా ఉంటున్నారు. వారంలో నాలుగు సార్లు హైదరాబాద్‌లో కనిపిస్తున్నారు. ఆయన రిటైర్డ్ ఐజీ కావడంతో ఓ అధికారి మాదిరిగానే వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్ల లేకపోతున్నారుఫలితంగా హిందూపురంలో వైసీపీని పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. ఫలితంగా కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. ఇక్బాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఆయన వల్ల నిజమైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సేవ్ వైఎస్సార్.. నిజమైన వైఎస్సార్ కార్యకర్తలకు న్యాయం జరగాలి’ అనే డిమాండ్‌తో అసంతృప్త నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. హిందూపురంలో నిజమైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారికి ఇప్పుడు అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు వాపోయారు.టీడీపీ నుంచి చేరిన వారికి, స్వార్థపరులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ టీడీపీపై పోరాటాలు చేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, కమీషన్లు ఇచ్చేవారికే పనులు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా హిందూపురంలో కలకలం రేగింది. అసలు వైసీపీలో ఏం జరుగుతోందనే చర్చ తెరమీదికి వచ్చింది. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక్కడ ఇక్బాల్ పర్యటించకపోవడం, ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గం మొహం కూడా చూడకపోవడంతో పరిస్థితి ఇలా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నాయకులు అయితే జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ అయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఇక్బాల్‌పై ఫిర్యాదులు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి జగన్ హిందూపురం సమస్యను ఎలా ? పరిష్కరిస్తారో చూడాలి.