బెజవాడలో పట్టుకోసం... ప్రయత్నాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడలో పట్టుకోసం... ప్రయత్నాలు

విజయవాడ, డిసెంబర్ 7, (way2newstv.com)
పోక‌చెక్కతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్కతో నే రెండంటా! – అనే రాజ‌కీయాల‌కు కేరాఫ్ బెజ‌వాడ‌. ఇక్కడి నాయ‌కులు, ఇక్కడి రాజ‌కీయాలు టోట‌ల్ డిఫ‌రెంట్‌. ఒకే పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ఎవ‌రి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవ‌రి వ్యూహాల్లో వారు ప్రయాణం చేస్తుంటారు కూడా. అలాంటి రాజ‌కీయాలున్న విజ‌య‌వాడ‌లో అధికార వైసీపీకి చాలా స‌వాళ్లే ఎదురు కానున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ , తూర్పు నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా ప‌శ్చిమ‌లోనూ ప్రజ‌ల మైండ్ సెట్ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పార్టీల ప్రభావం కంటే వ్యక్తుల ప్రభావ‌మే క‌నిపిస్తుంటుంది. న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మూడు భిన్నమైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.
 బెజవాడలో పట్టుకోసం... ప్రయత్నాలు

2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌లో వైసీపీ ప‌ట్టు సాధించి గెలిచినా.. త‌ర్వాత అక్కడ గెలిచిన జ‌లీల్‌ఖాన్ టీడీపీలోకి జంప్ చేసేశాడు. ఇక‌, ఈ ఏడాది కూడా ఇక్కడ ప్రజ‌లు వైసీపీకే ప‌ట్టం క‌ట్టారు. అయినంత మాత్రాన ప్రజ‌లు ఇక్కడ వైసీపీకే క‌ట్టుబ‌డి పోతార‌ని చెప్పడం క‌ష్టం. గాలి ఎటు అనుకూలంగా ఉంటే అటు ప్రజ‌లు మారిపోవ‌డం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్రత్యేక‌త. ఇక‌, సెంట్రల్‌లో ఈ ఏడాది వైసీపీ అతి కష్టం మీద 25 ఓట్ల తేడాతో నెట్టుకువ‌చ్చింది. దీనిని నిలుపుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పైగా ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా దూకుడు చూపిస్తున్నారు. మ‌ల్లాది ఇక్కడ పార్టీని ప‌టిష్టం చేసేందుకు శ‌క్తికి మించి క‌ష్టప‌డాలి.అదే స‌మ‌యంలో తూర్పులో క‌మ్మ వ‌ర్గం టీడీపీకి చాలా మేర‌కు అనుకూలంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ యేడాది ఎన్నిక‌ల్లో గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఇక్కడ టీడీపీ కేడ‌ర్ చాలా బ‌లంగా ఉంది. దీనిని వైసీపీ వైపు తిప్పుకోవ‌డం అంత సులువేమీకాదు. గ‌త రెండేళ్లలోనే ఇక్కడ వైసీపీకి ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు మారారు. రీసెంట్‌గా టీడీపీ నుంచి వ‌చ్చిన దేవినేని అవినాష్‌కు తూర్పు ప‌గ్గాలు ఇచ్చి… అంత‌కు ముందు వ‌ర‌కు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొప్పన భ‌వ‌కుమార్‌కు న‌గ‌ర పార్టీ అధ్యక్ష ప‌ద‌వి ఇచ్చారు. విజ‌య‌వాడ వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యత‌లు చేప‌ట్టిన బొప్పన భ‌వ కుమార్‌కు వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాలు కూడా పెద్ద ప‌రీక్షలే ఎదురు కానున్నాయి. న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ప‌రిస్థితి మ‌రీ అంత వ‌న్‌సైడ్‌గా లేదు. సెంట్రల్‌, తూర్పులో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జ‌ర‌గాల‌న్నా.. ఆయ‌న వ‌చ్చి కొబ్బరికాయ కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కేశినేనికి పార్టీల‌తో సంబంధం లేని ఇమేజ్ ఉంది. నానిని ఢీ కొట్టే స్థాయి ఉన్న వ్యక్తి ఇప్పుడు విజ‌య‌వాడ‌లో వైసీపీకి అత్యవ‌స‌రం. యువ‌త ఎక్కువ‌గా ఉన్న విజ‌య‌వాడ‌లో వీరిని వైసీపీ వైపు మ‌ళ్లించ‌డం కూడా బొప్పన‌కు అంత ఈజీకాద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.నిజానికి ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బొప్పన ఎవ‌రో కూడా విజ‌య‌వాడలో స‌గానికిపైగా జ‌నాల‌కు తెలియ‌దు. అప్పటి వ‌ర‌కు కార్పొరేట‌ర్‌గా ఉన్న ఆయ‌న్ను య‌ల‌మంచిలి ర‌విని ప‌క్కన పెట్టి ఎంపీగా పోటీ చేసిన పీవీపీ ఒత్తిడి మేర‌కు తూర్పు సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో గ‌ద్దెపై ఆయ‌న‌ ఓడిపోయారు. పైగా కమ్మ వ‌ర్గానికే చెందినా కూడా ఆ సామాజిక వ‌ర్గంలో ఆయ‌న‌కు పెద్దగా గుర్తింపు లేదు. పైగా న‌గ‌ర వ్యాప్తంగా కూడా ఆయ‌న ఎక్కడా ఎప్పుడూ దూకుడు ప్రద‌ర్శించి రాజ‌కీయాలు చేసింది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీని క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లి.. విభిన్నమైన అభిప్రాయాలున్న నాయ‌కుల‌ను క‌లుపుకొని వెళ్లడం బొప్పన‌కు అంత ఈజీకాద‌ని అంటున్నారు. మ‌రి బొప్పన బెజ‌వాడ వైసీపీ ద‌శ‌, దిశ‌ను ఎలా ? మారుస్తారో ? చూడాలి.