రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ డిసెంబర్ 7 (way2newstv.com):
దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పలు కీలక మార్గదర్శకాలను జారీచేసింది. మహిళల రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. రక్షణలో పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడి కేసులను రెండు నెలల్లో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు శనివారం లేఖను రాశారు. లైంగికదాడి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు.
మహిళల రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
అలాగే మహిళ, రక్షణ కొరకు కేంద్రానికి పలు సూచనలు కూడా చేయవచ్చని హోంశాఖ రాష్ట్రాలను కోరింది.కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, ఉన్నావ్, ఉత్తర భారత్‌లో పలు ముఖ్య నగరాల్లో సహా అనేక ప్రాంతాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో మహిళలు, ప్రజాసంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యాచార ఘటనలో నిందితులకు క్షమాభిక్ష పెట్టే సాంప్రదాయాన్ని పక్కనపెట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దిశ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చుతున్నాంటూ కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం కూడా ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.