వరంగల్, డిసెంబర్ 28, (way2newstv.com)
సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం సిద్ధమవుతోంది. కోటికిపైగా భక్తులు తరలివస్తారనే అంచనాతో ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శాశ్వత, తాత్కాలిక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేయగా, ఆయా శాఖల ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ వెంకటేశ్వర్లు సివిల్ పనులను డిసెంబర్ చివరి వారంలోగా, తాత్కాలిక పనులు జనవరి 15వ తేదీలోగా పూర్తి కావాలని ఆదేశించగా ఆఫీసర్లు పనుల్లో వేగం పెంచారు.భక్తులకోసం తాగునీటి సరఫరా, శానిటేషన్, మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యతలను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు అప్పగించగా, ఆఫీసర్లు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందుకోసం గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 10 వేల సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.
సమ్మక్క సారక్క జాతర పనులు వేగవంతం
వాటిని జాతర పూర్తయ్యేవరకు నిర్వహించేలా సిబ్బందిని నియమించనున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం సమీపాన, జంపన్నవాగు, రెడ్డిగూడెం, బ్రిడ్జి రోడ్డు, ఊరట్టం, కన్నెపల్లి రోడ్లు తదితర ప్రాంతాల్లో ఈ మరుగుదొడ్లు ఉంటాయి. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 35పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు జంపన్న వాగు వద్ద 360 బ్యాటరీ ఆఫ్ట్యాప్స్ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే జాతరకు నెలరోజుల ముందు నుంచే భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్యాప్స్ ఏర్పాటులో వేగం పెంచారు. వాగులో ఉన్న బావుల నుంచి నీటి సరఫరాకు కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్కో బ్యాటరీ ఆఫ్ టాప్కు 16 నుంచి 18 నల్లాలను అమర్చుతున్నారు. జంపన్న వాగుకు ఇరువైపుల సుమారు కిలోమీటరు నిడివితో ఈ టాప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 295 బాతింగ్గార్డ్స్నిర్మాణం జరుగుతోంది.భక్తులకు తాగునీరు సరఫరా చేసేందుకు మూడుచోట్ల భారీ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. రెండు ట్యాంకులను ఒక్కొక్కటి రూ.55 లక్షల వ్యయంతో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగినవి ఊరట్టం, రెడ్డిగూడెం సమీపంలో నిర్మిస్తుండగా, ఒక ట్యాంకును రూ.85 లక్షల నిధులతో జంపన్నవాగు సమీపంలో 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. అదేవిధంగా భక్తులు సేద తీరేందుకు ఆగే ప్రదేశాల్లో మినీ ట్యాంకులను సైతం నిర్మిస్తున్నారు. ఎంపికచేసిన అన్నిచోట్లా నల్లాలను అమర్చుతున్నారు. కొన్నిచోట్ల పాతవాటికి మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తున్నారు.మహాజాతర సందర్భంగా సమ్మక్క తల్లిని తీసుకువచ్చే చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెల వరకు ఉన్న ప్రధాన రోడ్డును విస్తరిస్తున్నారు. గతంలో ఈ రోడ్డు వెడల్పు కేవలం 8 ఫీట్లు ఉండగా ప్రస్తుతం మరో 4 ఫీట్ల మేర విస్తరించి రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. జనవరి 10వ తేదీలోగా రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు