పరిటాల సునీత మౌనం వెనుక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరిటాల సునీత మౌనం వెనుక

అనంతపురం, డిసెంబర్ 21, (way2newstv.com)
అవును.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. ఇదే ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకున్నవారు., ప‌ద‌వులు పొందిన వారు నేడు పార్టీ అధికారం కోల్పోగానే యూట‌ర్న్ తీసుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన ప‌రిటాల ర‌వి కుటుంబం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. గ‌త ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వంలో ప‌రిటాల సునీత మంత్రిగా ఉన్నారు.అయితే, అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో త‌న అల్లుడి పేరుతో ఆమె ప‌దుల సంఖ్యలో ఎక‌రాల స్థలాల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు రైతుల నుంచి కొనుగోలు చేసిన‌ట్టు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 పరిటాల సునీత మౌనం వెనుక

కేవ‌లం మాట‌ల రూపంలోనే వైసీపీ ప్రభుత్వం ఆరోపించ‌లేదు. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేత‌లు ఎక్కడ ఎంతెంత భూములు కొన్నారు? ఎవ‌రికి అన్యాయం జ‌రిగింది? అనే అంశాల‌ను గ‌ణాంకాల సాక్షిగా అసెంబ్లీలో వివ‌రించారు. ఈ క్రమంలోనే ప‌రిటాల సునీత త‌న అల్లుడి పేరుతో అమ‌రావ‌తిలో భూములు కొన్నార‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి గ‌ణాంకాల స‌హితంగా ఏక‌రువు పెట్టారు.ఇది ఒక‌ర‌కంగా టీడీపీ కి తీవ్రమైన త‌ల‌నొప్పిలా మారింది. మ‌రి ఈ నేప‌థ్యంలో దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప‌రిటాల కుటుంబం ముందుకు రాక‌పోవ‌డంపై పార్టీలోనే ర‌క‌ర‌కాల చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన టీడీపీ నేత‌ల్లో కొంద‌రు వైసీపీకి కౌంట‌ర్లు ఇస్తున్నా ప‌రిటాల సునీత కుటుంబం మాత్రం మౌనం వ‌హిస్తోంది. భూములు ఎవ‌రైనా ఎక్కడైనా కొనుగోలు చేసుకునేందుకు భార‌తీయ పౌరులుగా రాజ్యాంగ‌మే అవ‌కాశం క‌ల్పించింది. అయితే, ఇక్కడ రాజ‌ధాని ప్రక‌ట‌నకు ముందుగానే టీడీపీ నేత‌లు ఓ వ్యూహం ప్రకారం భూములు కొనుగోలు చేసి రైతుల‌ను మోసం చేశార‌ని, అమ‌రావ‌తి ప్రాంతంలో త‌మ భూములు ఉండేలా చూసుకున్నార‌ని అనేది వైసీపీ వాద‌న‌.ఈ నేప‌థ్యంలో ప‌రిటాల కుటుంబం కొనుగోలు చేసిన భూముల విష‌యంలో క్లారిటీ ఇచ్చేందుకు, ముఖ్యంగా త‌మ‌కు రాజ‌కీయంగా గుర్తింపు క‌ల్పించిన పార్టీకి మ‌చ్చలేకుండా ఉండేలా చూసేందుకు ముందుకు వ‌చ్చి ఏదో ఒక ప్రక‌ట‌న చేయాల్సి ఉన్నా.. మౌనం వ‌హించింది. ఇప్పటి వ‌ర‌కు కూడా ప‌రిటాల ఫ్యామిలీ ఈ విమ‌ర్శల‌పై ప‌ట్టించుకోలేదు. అంటే.. వీరు పార్టీ ఏమైనా ఫ‌ర్వాలేద‌ని సొంత ప్రయోజ‌నాలే ల‌క్ష్యమ‌ని భావిస్తున్నారా ? అనే సందేహం తెర‌మీదికి వ‌స్తోంది.