సీఏఏ పై టీడీపీ దారేంటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఏఏ పై టీడీపీ దారేంటీ

గుంటూరు, డిసెంబర్ 26, (way2newstv.com)
దేశంలోని సుమారు పది రాష్ట్రాలకు పైగా పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టాయి. మోడీ వ్యతిరేక శక్తులు అన్ని ఒకతాటిపైకి వచ్చి ఈ బిల్లుపై రచ్చ చేస్తూ పోరాటం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం లోని మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది తెలుగుదేశం. కమలం తో దోస్తానా కట్ అయ్యాక ప్రధాని నరేంద్ర మోడీపై దేశవ్యాప్త పోరాటానికి సూత్రధారిగా రంగంలోకి దిగి విమర్శలు, ఆరోపణలతో చక్రం తిప్పారు చంద్రబాబు. ఈ క్రమంలో అయన కాంగ్రెస్ అధినేతలను ఫరూక్ అబ్దుల్లా నుంచి మమతా బెనర్జీ వరకు అందరి ప్రశంసలు అందుకున్నారు. చంద్రబాబు తన చర్యల ద్వారా ముస్లిం ఓటు బ్యాంక్ ను తిరిగి ఆకర్షించగలిగానని భావించారు. అయితే ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
సీఏఏ పై టీడీపీ  దారేంటీ

బెంగాల్ సిఎం మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో ఎటు అడుగు వేస్తే అటు వేసేవారు చంద్రబాబు. వీరిద్దరి నడుమ గట్టి రాజకీయ బంధమే వుంది. అయినా కానీ కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పై మమత రూట్ లో వెళ్లేందుకు చంద్రబాబు వెనకాడుతున్నారు. అందుకే ఇప్పటివరకు పౌరసత్వ సవరణ బిల్లుపై కిమ్మనకుండా ఉండిపోయింది. దీనిని వ్యతిరేకిస్తూ కానీ అనుకూలంగా మాట్లాడకుండా తటస్థ ధోరణి తో సున్నితమైన ఈ అంశంపై అనుసరిస్తుంది. అయితే ఎన్నికల ముందు మైనారిటీ వర్గాలపై వరాల జల్లు కురిపించిన చంద్రబాబు ఆ వర్గం మనోగతాన్ని ప్రతిబింబించడంలో వెనకబడిపోయారు.బిజెపి తో వైసిపి సర్కార్ అంటకాగుతుందన్న విమర్శలు ఒక పక్క పెద్ద ఎత్తునే వినవస్తున్నాయి. కేంద్రం ద్వారా రాష్ట్రాభివృద్ధి కోసం ఒక అడుగు వెనక్కు తగ్గే రాజకీయాన్ని ఎపి సిఎం అనుసరిస్తూ వస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఆయనపై ప్రత్యర్ధులు ఆరోపణలకు తెరతీస్తోంది. అయినా కానీ జగన్ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి తన ప్రధాన ప్రత్యర్థి టిడిపి కన్నా ఈ విషయంలో మైలేజ్ పొందారు. పౌరసత్వ సవరణ బిల్లు ను అమలు చేసేది లేదని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంతో యుద్ధానికి సై అన్నాయి. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. మోడీ తో తిరిగి దోస్తీకి సిద్ధం అవుతున్న టిడిపి కి మాత్రం ఈ వ్యవహారం సంకటంగా పరిణమించింది. తాజా రాజకీయ వాతావరణం నేపథ్యంలో టిడిపి అధినేత నిర్ణయం ఎలా వుండబోతుందన్న అంశం ఆసక్తికరం గా మారింది.