మాబిడ్డల సంగతేంటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాబిడ్డల సంగతేంటి

హైద్రాబాద్, డిసెంబర్ 7 (way2newstv.com)
దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ముందుగా దిశ కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. దిశ ఆాత్మకు శాంతి కలిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే... దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.. మంచి విషయమే...మరి మా కూతుళ్లను అతి కిరాతకంగా చంపిన వాళ్లను మాత్రం ఎందుకు శిక్షించలేదు..? మా బిడ్డలకు మాత్రం ఆత్మ శాంతించొద్దా ద్దా అంటూ కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు.యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి ముగ్గురు చిన్నారుల పై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. తనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి..
మాబిడ్డల సంగతేంటి

దిశ నిందితుల్లాగా శ్రీనివాసరెడ్డినీ శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. మరోవైపు జడ్చర్లకు చెందిన ఓ బాలికను సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుని ఆగస్టు 29న హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కాగా.. దిశ హత్య కంటే ఒకరోజు ముందు హన్మకొండలో ఓ యువతిపై ఆమెపుట్టినరోజు నాడే అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితుడు సాయిని వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. వరంగల్‌లో  పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోలు పోసి కాల్చిన నిందితుడిని, 2017లో ఓ మహిళపై యాసిడ్‌ పోసి స్ర్కూడ్రైవర్‌తో కళ్లలో పొడిచి అతి దారుణంగా చంపిన నిందితుడు చందూ తని ఇద్దరు మిత్రులకు వెంటనే చంపేయాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారుఉన్నావో, జడ్చర్ల, వరంగల్ మానస... ఇలా ఎంతో మంది...దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశ నలుమూలల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. దిశకు న్యాయం జరిగిందని.. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. పలుచోట్ల పటాకులు పేల్చి.. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు ప్రజలు.మరో పక్క నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని.. మరి అలాంటి కుటుంబాలు ఇంకా చాలానే ఉన్నాయని.. వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నిర్భయ, ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌, హాజీపూర్‌ ఘటన, వరంగల్‌లో మానసపై అత్యాచారం, తిరుపతి వర్ష ...హత్య ఘటన ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఘటనలు మరుగునపడి ఉన్నాయి. ఆ నిందితులకు తగిన శిక్ష ఎప్పుడు పడుతుందోనని బాధిత కుటుంబాలు ఇప్పటికీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి.2012 డిసెంబర్‌ 16న దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైద్య విద్యార్థినిపై ఆరుగురు మృగాలు కర్కశంగా, దారుణంగా అత్యాచారం చేశారు. కదులుతున్న బస్సులోనే గంటకు పైగా అత్యాచారం చేసి.. అనంతరం ఆమెను బస్సులో నుంచి బయటకు విసిరేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు డిసెంబర్‌ 29న తుదిశ్వాస విడిచింది. అప్పట్లో ఈ ఘటన ఓ సంచలనం రేపింది. నిరసనలతో ఢిల్లీ రాజవీధులు బెంబేలెత్తిపోయాయి. నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ అరిచి గగ్గోలు పెట్టాయి. కాగా.. నిందితుల్లో ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. మిగిలినవారు ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఘటన జరిగి ఇప్పటికి ఏడేళ్లు పూర్తికావొస్తున్నా.. సరైన న్యాయం జరగలేదంటూ బాధిత కుటుంబం తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది.2018 డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో 23 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 30న బెయిల్‌ మీద బయటకు వచ్చిన నిందితులు బాధితురాలిపై కక్ష పెంచుకున్నారు. కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లిన బాధితురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న తుదిశ్వాస విడిచింది. అంతకుముందు కుటుంబ సభ్యులతో మాట్లాడిన యువతి.. నిందితులకు ఉరిశిక్ష పడాలన్నది తన చివరి కోరికగా చెప్పింది. ఆ కోరిక నెరవేరకుండానే బాధిత యువతి కనుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో హాజీపూర్‌ ఘటన ఓ సంచలనం సృష్టించింది. యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో 2015 నుంచి 2019 వరకు నలుగురు మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసి అనంతరం బావిలో మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డికి మరణ శిక్ష విధించాలంటూ ఆనాడు ఆందోళనలు కూడా జరిగాయి. ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నివసిస్తున్న ఇంటిని సైతం ధ్వంసం చేశారు. పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికీ సరైన శిక్ష అమలు కాకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌ 25న ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ రోడ్లెక్కాయి. దిశ ఘటనకు ఇచ్చిన ఇంపార్టెన్స్‌.. ఈ విషయంలో ఎందుకు లేదని విమర్శించాయి. చట్టమనేది అందరికీ ఒకేలా పనిచేయాలని.. కానీ మనదేశంలో మాత్రం అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.వరంగల్‌లో యువతి హత్య కలకలం రేపింది. పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే.. ఈ ఘాతుకానికి ప్రియుడే కారణమని నిర్ధారించిన పోలీసులు.. 24 గంటల్లోనే సాయిని అదుపులోకి తీసుకున్నారు. మానసను నమ్మించి కారులోనే అత్యాచారం చేసినట్లు తెలిపారు. అనంతరం భయంతో మానసను హత్య చేశాడని స్పష్టం చేశారు. సినీఫక్కీలో మృతదేహాన్ని మాయం చేయాలని చూశాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఇప్పటికే కూతురును కోల్పోయిన తమకు కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అత్యాచారం జరిపింది నలుగురైతే పోలీసులు ఒక్కరే నిందితుడని చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దిశ నిందితులను కాల్చి చంపినట్టే.. మానస కేసులో నిందితులను కాల్చి చంపాలని డిమాండ్‌ చేస్తోంది.వరంగల్ అర్బన్ జిల్లాలో మరో దారుణం  చోటుచేసుకుంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రపోతున్న చిన్నారిని ఆడిపిస్తానని ప్రవీణ్‌ తీసుకువెళ్లాడు. ఎప్పిటికీ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఓ చోట చిన్నారి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ప్రవీణ్ అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టుగా పోలీసులు నిర్థారించారు. పసిపిల్లపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.దిశ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై యావత్‌ దేశం కీర్తిస్తోంది. ఇలాంటి మరెన్నో ఘటనలు న్యాయం జరగక మూలన పడి ఉన్నాయని.. ఆ బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రేపిస్టులు ఎవరైనా.. రేపిస్టులేనని.. వారిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.