జనసేనాని దారెటు

విజయవాడ, డిసెంబర్ 27 (way2newstv.com)
అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకొని... ఒక్క అడుగుతోనే తమ ప్రయాణం సాగుతుందంటున్న జనసేనకు... ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన కలవరం కలిగిస్తోంది. జగన్ ప్రకటనను అన్నయ్య చిరంజీవి సమర్థించడంతో... తమ్ముడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. అమరావతినే రాజధానిగా ఉంచాలనే అభిప్రాయం, అక్కడి రైతుల్ని కాపాడాలనే ప్రకటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌... ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే... చిరు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండటం ఇబ్బంది కలిగిస్తున్న అంశం. దీని వల్ల చిరు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులూ రెండుగా చీలిపోతున్నారు. 
జనసేనాని దారెటు

మెగా ఫ్యామిలీ మరోసారి రెండుగా విడిపోతున్న సందర్భం ఇది.ఏపీ రాజకీయాల్లో జనసేన నిలదొక్కుకోవాలంటే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటమే సరైన విధానం అని పవన్ కళ్యాణ్ భావిస్తుంటే... అదే ప్రభుత్వాన్ని సమర్థించడం ద్వారా చిరంజీవి... జనసేనను ఇరకాటంలోకి నెట్టేశారు. ప్రతిసారీ అన్నయ్యను వెనకేసుకొచ్చే పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు అదే అన్నయ్య షాకిచ్చినట్లైంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సిన అంశం. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే... చిరు అభిమానులకు మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరవుతారు. ఐతే... అలా చేయడం ద్వారా... జనసేన... ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతుంది. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... చిరు అభిమానులకు పవన్ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అది పార్టీ మనుగడకు ఇబ్బంది కలిగించే అంశమే.ఇటీవల జగన్... కాపు నాయకులపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేయించారు. అందువల్ల చిరంజీవి... జగన్‌కి సపోర్ట్ ఇస్తున్నట్లు సంకేతాలొస్తున్నాయి. అన్నదమ్ముల అనుబంధం కోసం... పార్టీ దశ, దిశలను త్యాగం చేస్తే... అది జనసేన మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జనసేనకు సొంతంగా ఓ అజెండాను నిర్దేశించాలని రాజకీయ ప్రముఖులు సూచిస్తున్నారు. చిరంజీవిపై ఆధారపడటం, ఆయన్ను సమర్థిస్తూ ఉండటం వల్ల ఎప్పటికైనా చిక్కులు తప్పవంటున్నారు. ప్రజాభివృద్ధే అజెండాగా, వారికి మేలు చేసే నిర్ణయాలే దిశానిర్దేశంగా సాగినప్పుడే జనసేనకు మనుగడ ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై క్లారిటీతో లేరని తెలుస్తోంది.
Previous Post Next Post