పల్లెపోరుకు సై (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లెపోరుకు సై (పశ్చిమగోదావరి)

ఏలూరు, డిసెంబర్ 16 (way2newstv.com): 
పల్లె పోరుకు నగారా మోగక ముందే జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. మెల్లమెల్లగా రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆర్థిక, అంగబలమున్న వారి ఎంపికకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా, జనసేనలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాయి. 2013లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అత్యధిక స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ జిల్లాలోని అన్ని స్థానాలను తెదేపా దక్కించుకుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం సృష్టించింది. పాలకొల్లు, ఉండి శాసనసభ స్థానాలు మినహా అన్ని స్థానాల్లో వైకాపా గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. 
పల్లెపోరుకు సై (పశ్చిమగోదావరి)

జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తెదేపా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తెదేపాను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామ కమిటీలను ఏర్పాటుచేస్తోంది. మరోవైపు పల్లె పోరులోనూ విజయం సాధించాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే తమవంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ ఆశావహులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి తాము చేసిన సేవలను గుర్తు చేస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామంలో పట్టుపెంచుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంలో ఆశావహులు గ్రామాల్లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కాదేది ప్రచారానికి అనర్హం అనే రీతిన కార్యక్రమంతో సంబంధం లేకుండా అన్నింటా తామున్నామనే భావన కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. పేదలకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు చాలామంది ఆశావహులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టిస్తున్నారు. అధినాయకుల ఫొటోలతోపాటు తమ చిత్రాలు ఉండేలా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు, ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఆయా పార్టీల అధినాయత్వం సైతం స్థానిక ఎన్నికల విషయమై విస్తృత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని విధాలా అర్హులను ఎన్నికల బరిలో నిలిపి సత్తా చాటేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులనే బరిలో దిపేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలయ్యే నాటికి రాజకీయం మరింత రసకందాయంలో పడుతుందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.